చిత్తూరు జిల్లాలో చెట్టును ఢీకొట్టిన బైక్.. అక్కడికక్కడే ఇద్దరి మృతి!
- జిల్లాలోని వి.కోట మండలంలో ఘటన
- వేగంగా వెళుతూ అదుపుతప్పిన వాహనం
- ఆసుపత్రికి తరలింపు.. అప్పటికే చనిపోయారన్న వైద్యులు
జిల్లాలోని వి.కోట మండలం హనుమంతనగర్ వద్ద ఇద్దరు ప్రయాణిస్తున్న ఓ బైక్ అదుపుతప్పింది. దీంతో వాహనం ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అటుగా వెళుతున్న వాహనదారులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు.
దీంతో హుటాహుటిన వీరిని ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. కాగా, ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. మృతులు వి.కోట మండలం ముదారందొడ్డి గ్రామానికి చెందినవారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.