తిరుమల భక్తులకు అలర్ట్.. ఎస్‌ఎస్‌డీ టోకెన్ల రద్దు పొడిగింపు
- సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో పెరిగిన రద్దీ
- ఎస్‌ఎస్‌డీ టోకెన్ల రద్దును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించిన టీటీడీ
- నిన్న స్వామి వారిని దర్శించుకున్న 72,019 మంది భక్తులు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. కొండపై రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో వారి సౌకర్యార్థం, నియంత్రణ కోసం ఉచిత సర్వదర్శనం టైమ్ స్లాట్ (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల నిలిపివేతను మరో నాలుగు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మొదట సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు మాత్రమే ఈ టోకెన్ల జారీని రద్దు చేయగా, రద్దీ ఒత్తిడి తగ్గకపోవడంతో సెప్టెంబర్ 24వ తేదీ వరకు రద్దు ప్రక్రియను పొడిగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరిగి సెప్టెంబర్ 25 నాటి దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను సెప్టెంబర్ 24న తిరుపతిలోని కౌంటర్లలో పంపిణీ చేయనున్నారు.
మరోవైపు, బ్రహ్మోత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ ఉదయం శ్రీమలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. నిన్న ఒక్కరోజే 72,019 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 25,431 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.5 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.