ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు.. 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం!
- ప్రత్యేకాధికారుల పాలన రాజ్యాంగ విరుద్ధమన్న కోర్టు
- ప్రభుత్వం జారీచేసిన జీవో 90 కొట్టివేత
- ఎన్నికల ఏర్పాట్లు చేయాలని ఈసీకి ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగించడాన్ని సవాలు చేస్తూ కొంతమంది మాజీ సర్పంచులు హైకోర్టును గతంలో ఆశ్రయించారు. అధికారుల ద్వారా పాలన నిర్వహించడం అన్నది రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. వెంటనే ఈ జీవోను కొట్టివేసి, ఎన్నికలు నిర్వహించాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో 90ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
వచ్చే 3 నెలల్లోగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఎన్నికల ప్రక్రియను ప్రత్యేకాధికారుల ద్వారా పూర్తి చేయాలని సూచించింది. ఇటీవల తెలంగాణలో సైతం ప్రత్యేకాధికారుల నియామకాలను రద్దు చేసిన హైకోర్టు.. 3 నెలల్లోగా ఎన్నికలు చేపట్టాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.