Advertisement

వాంగ్‌చుక్‌ దీక్ష ముగిసినా.. జంతర్‌మంతర్‌ ఆందోళన కొనసాగుతుంది: కాక్రోచ్‌ పార్టీ

Cockroach Janata Party demands Dharmendra Pradhan resignation over student issues
  • ప్రధాన్‌ రాజీనామా చేసే వరకూ ఉద్యమం కొనసాగుతుందన్న సీజేపీ
  • జంతర్‌మంతర్‌ ఆందోళన కొనసాగిస్తామని వెల్లడి
  • వాంగ్‌చుక్‌ రెండు హామీలు సాధించారని వ్యాఖ్య  
  • కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధులు భేటీ కానున్నట్లు వెల్లడి
సోనమ్‌ వాంగ్‌చుక్‌ తన నిరాహార దీక్షను విరమించినప్పటికీ జంతర్‌మంతర్‌లో జరుగుతున్న ఆందోళన కొనసాగుతుందని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) స్పష్టం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని పార్టీ ప్రకటించింది.

సీజేపీ ప్రతినిధి ఆశుతోష్‌ రాంకా మాట్లాడుతూ.. వాంగ్‌చుక్‌ ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమించాలని తామే కోరామని తెలిపారు. ప్రభుత్వం నుంచి రెండు కీలక హామీలు సాధించడంలో వాంగ్‌చుక్‌ విజయం సాధించారని చెప్పారు. ఆందోళనకారులపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని, నీట్‌ పేపర్‌ లీక్‌ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.

అయితే ఉద్యమం ప్రధాన డిమాండ్‌ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామానేనని రాంకా స్పష్టం చేశారు. ఆయన పదవి నుంచి తప్పుకొనే వరకు జంతర్‌మంతర్‌లో ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు.

పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, పేపర్‌ లీక్‌లపై పార్లమెంట్‌లో చర్చ, బాధిత కుటుంబాలకు పరిహారం, ఆందోళన చేసిన విద్యార్థులపై కేసులు నమోదు చేయబోమన్న లిఖితపూర్వక హామీల అనంతరం వాంగ్‌చుక్‌ దీక్షను విరమించిన విషయం తెలిసిందే. ఇదే అంశాలపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో సీజేపీ ప్రతినిధులు సమావేశం కానున్నట్లు రాంకా తెలిపారు.
Advertisement
Sonam Wangchuk
Cockroach Janata Party
Dharmendra Pradhan
Jantar Mantar protest
NEET paper leak
Education Minister resignation

More Telugu News