ఉండి వైసీపీలో కలకలం.. వైసీపీకి గుడ్ బై చెప్పనున్న పీవీఎల్ నరసింహరాజు?
- ఉండి వైసీపీ సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్ నియామకం
- తనను ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంతో నరసింహరాజు అసంతృప్తి
- ఈరోజు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసీపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేగుతున్నాయి. పార్టీ సీనియర్ నేత, నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ పీవీఎల్ నరసింహరాజు వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఆయన ఈరోజే తన అధికారిక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్‌ను వైసీపీ అధిష్ఠానం నియమించింది. పీవీఎల్ నరసింహరాజును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించింది. అయితే ఏళ్లుగా నియోజకవర్గంలో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తనను ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి ఆకస్మికంగా తప్పించడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఈ పరిణామంపై నరసింహరాజు వర్గీయులు, స్థానిక నేతలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కష్టపడిన నాయకుడిని పక్కనబెట్టడం ఏమాత్రం తగదని వారు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై తీవ్ర తీవ్ర అసంతృప్తితో ఉన్న పీవీఎల్, ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కష్టమని భావిస్తూ రాజీనామా బాట పట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.