మన్ కీ బాత్ లో మాట్లాడటం కాదు.. పార్లమెంట్ లో సమాధానం చెప్పాలి: మల్లికార్జున ఖర్గే
- మోదీ విడుదల చేసిన వీడియోపై ఖర్గే విమర్శలు
- దృష్టి మళ్లించేందుకే మన్ కీ బాత్ వంటి కార్యక్రమాలు అంటూ మండిపాటు
- మోదీకి రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేదని విమర్శ
'నీట్' అక్రమాలు, పేపర్ లీకేజీల వ్యవహారంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ అర్ధరాత్రి వేళ సెల్ఫీ వీడియో విడుదల చేయడంపై ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏకపక్షంగా రేడియో లేదా వీడియోల ద్వారా 'మన్ కీ బాత్' ఉపన్యాసాలు ఇవ్వడం మాని, విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ కీలక అంశంపై పార్లమెంట్ వేదికగా స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రధాని అర్ధరాత్రి వేళ వీడియోల ద్వారా సందేశాలు ఇవ్వడం కాకుండా, ఉభయ సభల ఎదుట అధికారికంగా ప్రకటన విడుదల చేయాలని స్పష్టం చేశారు. నిరుద్యోగం, నీట్, యుజీసీ-నెట్ పేపర్ లీకేజీల వంటి అక్రమాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి, ప్రజాగ్రహం నుంచి దృష్టి మళ్లించేందుకే 'మన్ కీ బాత్' వంటి కార్యక్రమాలను వాడుకుంటోందని ఆరోపించారు.
ప్రతిపక్షాలు సభలో అడుగుతున్న పదునైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం దాటవేత ధోరణి ప్రదర్శిస్తోందని ఖర్గే విమర్శించారు. ప్రధాని మోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై గానీ, రాజ్యాంగ వ్యవస్థలపై గానీ ఏమాత్రం గౌరవం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.