జ‌డ్డూ నో బాల్స్‌పై గవాస్కర్ ఫైర్.. బౌలర్‌తో పాటు కోచ్‌కూ జరిమానా వేయాల‌న్న స‌న్నీ!

Ravindra Jadeja No Balls Sunil Gavaskar Slams Player and Suggests Fine for Coach
  • శ్రీలంకతో టెస్టులో జడేజా పదేపదే నో బాల్స్ వేయడంపై స‌న్నీ ఆగ్రహం
  • 2021 నుంచి జడేజా 85కి పైగా నో బాల్స్ వేశాడని గణాంకాల వెల్లడి
  • టెస్టుల్లో ఫ్రీ హిట్ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించిన సునీల్‌ గవాస్కర్
  • నో బాల్ వేసిన బౌలర్‌తో పాటు బౌలింగ్ కోచ్‌కూ జరిమానా విధించాలని సూచన
  • జరిమానా డబ్బుతో టీమ్ డిన్నర్ ఏర్పాటు చేయాలన్న గవాస్కర్
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ, టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రదర్శన, ముఖ్యంగా అతని క్రమశిక్షణారాహిత్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిరీస్ ఆసాంతం పదేపదే క్రీజు దాటి బంతులు విసిరిన జడేజా తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశాడు. కేవలం ఆటగాడికే కాకుండా, బౌలింగ్ కోచ్‌కు కూడా జరిమానా విధించాలని స‌న్నీ సంచలన సూచన చేశాడు.

శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో రవీంద్ర జడేజా పలుమార్లు నో బాల్స్ వేశాడు. గణాంకాల ప్రకారం.. 2021 నుంచి ఇప్పటివరకు అతను 85కి పైగా నో బాల్స్ వేశాడంటే అతని బౌలింగ్‌లో క్రమశిక్షణ ఎంతగా లోపించిందో అర్థం చేసుకోవచ్చు. జడేజానే కాకుండా, అరంగేట్ర స్పిన్నర్ సారాంశ్ జైన్ కూడా రెండో టెస్టులో అనేక నో బాల్స్ వేసి నిరాశపరిచాడు. ఈ వ్యవహారంపై భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందిస్తూ.. "టెస్టుల్లో కూడా నో బాల్స్‌కు ఫ్రీ హిట్ పెడితే బౌలర్లు జాగ్రత్త పడతారేమో" అని సరదాగా వ్యాఖ్యానించాడు.

అయితే, కోచ్ వ్యాఖ్యలపై సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డాడు. "టెస్టు క్రికెట్‌లో బ్యాటర్లకు పరుగులు చేయడం ఇప్పటికే చాలా సులభంగా మారింది. ఓవర్‌కు రెండు బౌన్సర్ల పరిమితి, బౌండరీ లైన్లను దగ్గరకు జరపడం వంటివి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఫ్రీ హిట్‌లు ప్రవేశపెట్టి బ్యాటింగ్‌ను మరింత సులభతరం చేయొద్దు" అని గవాస్కర్ ఘాటుగా పేర్కొన్నాడు. నో బాల్స్ వేయకుండా ఉండటం అనేది పూర్తిగా ఆటగాళ్ల నియంత్రణలో ఉండే అంశమని, టేప్ మెజర్‌తో రనప్ మార్క్ చేసుకునే ఈ ఆధునిక రోజుల్లో ఇలాంటి పొరపాట్లకు క్షమాపణలు ఉండవని స్పష్టం చేశాడు.

ఈ సమస్యకు పరిష్కారంగా గవాస్కర్ కొన్ని ఆసక్తికర సూచనలు చేశాడు. "నో బాల్ వేసిన ఆటగాడికి భారీ జరిమానా విధించాలి. అదే తప్పు మళ్లీ పునరావృతం చేస్తే ఆ జరిమానాను రెట్టింపు చేయాలి. అంతటితో ఆగకుండా, ఆటగాడి జరిమానాలో సగం మొత్తాన్ని బౌలింగ్ కోచ్‌కు కూడా విధించాలి. అప్పుడే బాధ్యత పెరుగుతుంది" అని అన్నాడు. 

ఈ జరిమానాల ద్వారా వసూలైన మొత్తంతో సిరీస్ చివరలో టీమ్ సభ్యులందరికీ డిన్నర్ ఏర్పాటు చేయవచ్చని, ఇది జట్టులో బంధాన్ని మరింత పెంచుతుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా ఫీల్డింగ్‌లో త్రోను బ్యాకప్ చేయకపోవడం వంటి ఇతర చిన్న పొరపాట్లకు కూడా జరిమానాలు విధించే ఆలోచనను జట్టు సభ్యులు ఓటింగ్ ద్వారా నిర్ణయించుకోవచ్చని, ఇది ఒక సరదా కార్యకలాపంగా మారుతుందని పేర్కొన్నాడు.
Advertisement
Ravindra Jadeja
Sunil Gavaskar
India vs Sri Lanka Test
Cricket No Balls
Sairaj Bahutule
Indian Cricket Team

More Telugu News