సమాజానికి సిగరెట్ కంటే వైసీపీ హానికరం: పయ్యావుల కేశవ్

Payyavula Keshav says YCP is more harmful to society than cigarettes
  • అధికారం కోసం జగన్ ఎన్ని అడ్డదార్లు తొక్కేందుకైనా సిద్ధపడతారన్న కేశవ్
  • గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, కూటమి అగైన్ అండ్ అగైన్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు
  • పార్టీలో గ్రూపులు కడితే పతనం తప్పదని శ్రేణులకు హెచ్చరిక

ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్యవాది కాదని, అధికారం కోసం ఎన్ని అడ్డదార్లయినా తొక్కేందుకు సిద్ధపడతారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ లీగల్ లైన్ దాటి అధికారాన్ని ఉపయోగించరని.. కానీ జగన్ మాత్రం ప్రతిరోజూ లైన్ దాటుతుంటారని ఆరోపించారు. "సిగరెట్ తాగడం ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో.. సమాజానికి వైసీపీ అంతకంటే హానికరం" అని వ్యాఖ్యానించారు.


ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ జగన్ అరాచక పాలన రాకూడదంటే.. 'గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, కూటమి అగైన్ అండ్ అగైన్' అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలు ఇచ్చిన 93 శాతం స్ట్రైక్ రేటుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుందని గుర్తుచేశారు. 


పోలింగ్ బూత్ స్థాయిలో వెనకడుగు వేయకుండా నిలబడిన కార్యకర్తల శ్రమ, ధైర్యమే ఈ చారిత్రాత్మక విజయానికి కారణమన్నారు. కార్యకర్తల త్యాగాలను మరిచిపోతే ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించలేదని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిపించుకోవడానికి నేతలంతా కష్టపడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.


పార్టీలో గ్రూపు రాజకీయాలు కడితే పతనం తప్పదని నేతలను, కార్యకర్తలను పయ్యావుల హెచ్చరించారు. చిన్నచిన్న అలకలు వీడి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఏవైనా సమస్యలుంటే కొట్లాడైనా పరిష్కరించుకోవాలి తప్ప పార్టీకి దూరం కావొద్దని సూచించారు. 


"మనం ప్రభుత్వంలో ఉన్నామని నిద్రపోవద్దు.. రాయలసీమ రాజకీయాల్లో ఎప్పుడూ అప్రమత్తత అవసరం" అని పేర్కొంటూ.. టీడీపీ శ్రేణులు ఓటర్ లిస్ట్‌పై పూర్తి పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే, తమ కూటమి ప్రభుత్వం రాయలసీమను 'హార్టికల్చర్ హబ్' (ఉద్యానవన కేంద్రం) గా మార్చడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు.

Go Back to Shorts
Payyavula Keshav
YCP
Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
Rayalaseema Horticulture Hub
AP Local Body Elections

More Telugu News