ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మంటలు... కిటికీల నుంచి దూకేసిన ప్రయాణికులు
- ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వద్ద తృటిలో తప్పిన భారీ ప్రమాదం
- జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళుతున్న బస్సులో మంటలు
- వెంటనే రోడ్డు పక్కన బస్సును ఆపేది అందరూ దిగిపోవాలంటూ కేకలు వేసిన డ్రైవర్
- ప్రయాణికులందరూ కిటికీల నుంచి క్షణాల్లో దిగిపోయిన వైనం
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వద్ద ఈరోజు ఒక భారీ బస్సు ప్రమాదం తృటిలో తప్పింది. జగ్గయ్యపేట నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఒక పెద్ద ప్రాణనష్టం తప్పి, అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
బస్సు గొల్లపూడి ప్రాంతానికి చేరుకోగానే, ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే అలర్ట్ అయిన ఆయన బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను కిందకు దిగిపోవాల్సిందిగా గట్టిగా కేకలు వేశాడు. బస్సు తలుపు వైపు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో... తీవ్ర ఆందోళనలో ఉన్న ప్రయాణికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సు కిటికీల గుండా బయటకు దూకేశారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అందరూ క్షణాల వ్యవధిలో బస్సు నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చెలరేగిన మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అటు అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాద ఘటనపై ఆర్టీసీ, పోలీస్ అధికారులు స్పందిస్తూ... కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఏదైనా మెకానికల్ ఫెయిల్యూర్ లేదా షార్ట్ సర్క్యూట్ లాంటి సాంకేతిక సమస్యల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో వాహనాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.