పుణెలో విచిత్రం.. లోకల్ జాతరలో కొన్న బెడ్‌షీట్‌పై 'మేడ్ ఇన్ పాకిస్థాన్' లేబుల్!
- బెడ్‌షీట్‌పై పాకిస్థాన్ లేబుల్ గుర్తింపు
- ఉతికిన తర్వాత బయటపడిన ట్యాగ్
- పుణె స్థానిక జాతరలో కొనుగోలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- సప్లై చైన్‌పై పోలీసుల దర్యాప్తు
చించ్వాడ్ ప్రాంతంలోని ప్రసిద్ధ శ్రీ మోరయా గోసావి ఆలయ వాతావరణంలో బుధవారం జరిగిన సంకష్ట చతుర్థి జాతరలో ఆ మహిళ ఈ బెడ్‌షీట్‌ను కొనుగోలు చేసింది. కొనేటప్పుడు ఎలాంటి అనుమానాస్పద గుర్తులు లేవు. అయితే, ఇంటికి వెళ్లాక దానిని వాష్ చేయడంతో ఒక మూలన దాచిన లేబుల్ స్పష్టంగా కనిపించింది. అది ఎక్కడి నుంచి వచ్చిందనే ఆందోళనతో ఆ మహిళ రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, దిగుమతి నిబంధనల ఉల్లంఘనలపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
పోలీసుల ప్రత్యేక నిఘా
ఈ వైరల్ వీడియోపై తక్షణమే స్పందించిన పింప్రి-చించ్వాడ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బెడ్‌షీట్‌ను అమ్మిన సదరు వీధి వ్యాపారి (Vendor) ఎవరు? అతడికి ఈ స్టాక్ ఎక్కడి నుంచి సరఫరా అయింది? స్థానిక మార్కెట్లోకి ఈ పాకిస్థాన్ వస్తువులు ఎలా ప్రవేశించాయి? అనే సప్లై చైన్ నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు పింప్రి-చించ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్‌కు లేఖ రాశారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
మహారాష్ట్రలోని శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లాలో కూడా 'మేడ్ ఇన్ పాకిస్థాన్' అని ఉన్న కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జాతరలు, స్థానిక మార్కెట్లలో విక్రయించే వస్తువులపై నిఘా వర్గాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. భారత్-పాకిస్థాన్ మధ్య ప్రత్యక్ష వాణిజ్య దిగుమతులపై కఠినమైన ఆంక్షలు ఉన్నందున.. ఇలాంటి లేబుల్స్ ఉన్న వస్తువులు రావడం భద్రత, వాణిజ్య పరంగా తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నారు. ఇవి స్మగ్లింగ్ మార్గాల ద్వారా వచ్చాయా? లేదా మూడో దేశం ద్వారా మార్కెట్లోకి ప్రవేశించాయా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.