బీజేపీని వీడిన అన్నామలై... స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

K Annamalai leaves BJP and State President reacts to the resignation
  • అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోద ముద్ర
  • అన్నామలై నిష్క్రమణతో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్న తమిళనాడు బీజేపీ
  • వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమని నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్య
  • పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు కొనసాగుతాయని వెల్లడి
తమిళనాడు బీజేపీ కీలక నేత, మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించింది. త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అన్నామలై ప్రకటించారు. అన్నామలై రాజీనామాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఇవాళ ఆమోద ముద్ర వేశారు. ఈ పరిణామంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందించారు.

అన్నామలై రాజీనామా వల్ల పార్టీకి ఎలాంటి నష్టంలేదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.

మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2020లో బీజేపీలో చేరి, 2025 ఏప్రిల్ వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన స్థానంలో నాగేంద్రన్ నియమితులయ్యారు. "బీజేపీ సభ్యుడిగా, ఒక తమిళుడిగా నా గుర్తింపునకు మధ్య అంతర్గత సంఘర్షణ నెలకొంది. అందుకే నేడు ఒక నూతన ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. మా రాజకీయ పార్టీ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది" అని అన్నామలై స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కేవలం 3 శాతం ఓట్లకే పరిమితమైంది. అయితే, అన్నామలై నేతృత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 11 శాతం ఓట్లు సాధించినప్పటికీ, ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. వాస్తవానికి, 2025 డిసెంబర్‌లోనే పార్టీని వీడాలన్న తన ఉద్దేశాన్ని అధిష్ఠానానికి వివరించానని, అయితే ఎన్నికల వరకు వేచి ఉండాలని కోరడంతోనే ఇన్నాళ్లూ కొనసాగానని అన్నామలై వివరించారు.
Go Back to Shorts
K Annamalai
BJP
Tamil Nadu Politics
Nainar Nagendran
New Political Party
Tamil Nadu Assembly Elections

More Telugu News