క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలోకి మెటా?.. అమెజాన్, గూగుల్‌కు జుకర్‌బర్గ్ సవాల్!
- ఈ విషయాన్ని సూత్రప్రాయంగా అంగీకరించిన సీఈవో జుకర్‌బర్గ్
- ఏఐపై భారీ పెట్టుబడులే ఈ నిర్ణయానికి కీలక కారణం
- మిగులు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఆదాయంగా మార్చుకునే వ్యూహం
ప్రస్తుతం మెటా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2026 సంవత్సరానికి గాను ఏకంగా 125 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్ డాలర్ల వరకు మూలధన వ్యయాన్ని కేటాయించింది. ప్రధానంగా డేటా సెంటర్లు, సర్వర్లు, ఏఐ సామర్థ్యాల కోసం ఈ నిధులను వెచ్చిస్తోంది. ఈ భారీ పెట్టుబడుల వల్ల తమ అంతర్గత అవసరాలకు మించి కంప్యూటింగ్ సామర్థ్యం మిగిలిపోతే, దానిని క్లౌడ్ సర్వీస్‌గా ఇతర కంపెనీలకు అందించడం ద్వారా ఆదాయం పొందవచ్చని జుకర్‌బర్గ్ వివరించారు.
"మా కంప్యూటింగ్ వనరులు, ఏపీఐ సేవలను కావాలని ఇప్పటికే చాలా కంపెనీలు అడుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మా అవసరాలకే దానిని వాడుకుంటున్నాం. అందుకే ఇంకా ఆ పని చేయలేదు" అని జుకర్‌బర్గ్ తెలిపారు. అవసరానికి మించి మౌలిక సదుపాయాలు నిర్మిస్తే నష్టపోకుండా ఉండేందుకు ఈ క్లౌడ్ వ్యాపారం ఒక సహజమైన ప్రత్యామ్నాయ మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రకటనల వ్యాపారంపైనే ప్రధానంగా ఆధారపడిన మెటా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడంలో భాగంగానే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ డేటా సెంటర్ల నిర్వహణలో మెటాకు ఉన్న నైపుణ్యం, లామా (Llama) వంటి ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ ఈ కొత్త వ్యాపారానికి కలిసొచ్చే అంశాలు. ప్రస్తుతం హైపర్‌స్కేల్ క్లౌడ్ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఏఐకి పెరుగుతున్న డిమాండ్‌తో ఇది మరింత వేగంగా వృద్ధి చెందుతోంది. ఇలాంటి కీలక సమయంలో మెటా క్లౌడ్ రంగంలోకి ప్రవేశిస్తే, మార్కెట్ సమీకరణాలు మారే అవకాశం ఉంది.