Advertisement

భారతదేశ క్వాంటమ్ భవిష్యత్తుకు అమరావతి ముఖద్వారం: సీఎం చంద్రబాబు

Amaravati is the gateway to Indias quantum future says CM Chandrababu Naidu
  • క్వాంటం టెక్నాలజీలో ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చే లక్ష్యం
  • ప్రముఖ క్వాంటం కంపెనీ 'క్వాంటినమ్‌' సీఈవోతో నిన్న సీఎం చంద్రబాబు భేటీ
  • అమరావతిని క్వాంటం భవిష్యత్తుకు గేట్‌వేగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడి
  • పరిశోధన, హార్డ్‌వేర్, స్టార్టప్‌లతో పూర్తిస్థాయి వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్వాంటం టెక్నాలజీ రంగంలో దేశానికి ముఖద్వారంగా (గేట్‌వేగా) తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ దిశగా మరో కీలక అడుగు పడింది. ప్రపంచంలోని ప్రముఖ క్వాంటం కంప్యూటింగ్ సంస్థ 'క్వాంటినమ్‌' సీఈవో డాక్టర్ రాజీబ్ హజ్రాతో, ఆయన బృందంతో సీఎం చంద్రబాబు నిన్న సమావేశమవడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యం ద్వారా దేశ క్వాంటం ఆశయాలను బలోపేతం చేయడంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సోషల్ మీడియా వేదికగా కీలక వివరాలను పంచుకున్నారు. క్వాంటం టెక్నాలజీకి సంబంధించి ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేలా ఏపీలో ఒక సమగ్ర వ్యవస్థను (ఎకోసిస్టమ్) నిర్మించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పరిశోధన, అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, క్వాంటం హార్డ్‌వేర్, సప్లై చైన్, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, వాణిజ్యీకరణ వంటి అన్ని అంశాలపై దృష్టి సారించనున్నట్లు వివరించారు.

"భారతదేశ క్వాంటం భవిష్యత్తుకు అమరావతి వేగంగా ముఖద్వారంగా మారుతోంది. ప్రపంచంలోని ప్రముఖ ఆవిష్కర్తలు ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యం అవుతున్న తరుణంలో, భవిష్యత్ తరానికి చెందిన క్వాంటం టెక్నాలజీల పరిశోధన, అభివృద్ధి, పరిష్కారాల కేంద్రంగా అమరావతి అభివృద్ధి చెందుతోంది" అని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.

క్వాంటిన్యూమ్‌ వంటి గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలతో భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను, ముఖ్యంగా రాజధాని అమరావతిని హై-టెక్ రంగంలో కీలక కేంద్రంగా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా స్పష్టమవుతోంది. ఈ వ్యూహాత్మక ఒప్పందంతో భవిష్యత్ టెక్నాలజీలో ఏపీ కీలక పాత్ర పోషించేందుకు మార్గం సుగమం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Advertisement
Chandrababu Naidu
Amaravati
Quantum Computing
Quantinuum
Andhra Pradesh
Quantum Technology Ecosystem

More Telugu News