Advertisement

పవన్‌ కోసం కలసికట్టుగా పనిచేద్దాం: నాదెండ్ల మనోహర్ పిలుపు!

Nadendla Manohar calls to work together for Pawan Kalyan
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని జనసైనికులకు నాదెండ్ల పిలుపు
  • గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టాలని హితవు
  • అన్ని పదవులు ఒకేసారి ఆశించవద్దన్న మనోహర్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా జనసేన శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పార్టీలో అంతర్గత విబేధాలకు, గ్రూపు రాజకీయాలకు ఏమాత్రం తావులేకుండా అందరూ కలసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. "మనమంతా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వం కోసమే పనిచేస్తున్నాం.. వ్యక్తిగత వర్గాలు వద్దే వద్దు" అని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.


గత కార్పొరేషన్ ఎన్నికల్లో అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ జనసేన ధైర్యంగా నిలబడిందని, విజయవాడలోని 39 డివిజన్లలో పోటీ చేసి సుమారు 50 వేల ఓట్లు సాధించడమే పార్టీకి ఉన్న క్షేత్రస్థాయి బలానికి నిదర్శనమని అన్నారు. ఆ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తల శ్రమను పార్టీ ఎప్పటికీ మరువదని చెప్పారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు కేవలం సింబల్ పైనే ఆధారపడకుండా, వ్యక్తిగత విశ్వసనీయతను, ప్రజలతో అనుబంధాన్ని పెంచుకోవాలని సూచించారు. కేవలం కార్లలో తిరుగుతూ పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టినంత మాత్రాన ఓట్లు రావని, సమస్యల పరిష్కారంలో భాగమైనప్పుడే ప్రజలు మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు.


ప్రస్తుతం జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నందున అన్ని పదవులను ఒకేసారి ఆశించడం సరికాదని, దశాబ్దాలుగా ఉన్న ఇతర కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ క్రమంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీపై, పవన్ కల్యాణ్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను, దుష్ప్రచారాన్ని కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని, నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Advertisement
Nadendla Manohar
Pawan Kalyan
Janasena Party
Andhra Pradesh Local Body Elections
Janasena NDA Alliance
Janasena PAC Chairman

More Telugu News