Chandrababu Naidu: అమరావతిలో సీసీ కెమెరాలు తప్పనిసరి... వరుస అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu Naidu Orders Mandatory CC Cameras in Amaravati for Security
షార్ట్స్‌లో చూడండి
రాజధాని అమరావతి నిర్మాణ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పనులు వేగంగా జరుగుతున్న సమయంలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాల నేపథ్యంలో, ప్రతి నిర్మాణ సంస్థ తమ సామగ్రి నిల్వచేసే యార్డులో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రాజధానిలో భద్రతా వైఫల్యాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడి, రాజధానిలో పనులు ఊపందుకున్న తర్వాత జరుగుతున్న వరుస ఘటనలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాయపూడి వద్ద హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఓ సంస్థకు చెందిన పైపులు దగ్ధమైన ఘటనపై సచివాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ కుమార్ లడ్డా, గుంటూరు ఎస్పీ వకుళ్ జిందాల్‌తో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ వరుస ఘటనలు ప్రమాదవశాత్తు జరుగుతున్నాయా, లేక వీటి వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే విషయంపై నిగ్గు తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఘటన జరిగిన తీరు, అంత త్వరగా మంటలు వ్యాపించడానికి గల కారణాలను ఫోరెన్సిక్ ఆధారాలతో సహా వెలికితీయాలని సూచించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "రాజధానిలో పెద్దఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కోట్ల విలువైన సామగ్రిని నిల్వ చేశారు. ఇలాంటి సమయంలో జరుగుతున్న ఘటనల వల్ల పనులకు అనవసర అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి పటిష్ఠ చర్యలు తీసుకోవాలి" అని అన్నారు. రాజధాని ప్రాంతంలో అదనపు పెట్రోలింగ్ నిర్వహించాలని, డ్రోన్ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణ సంస్థలు కూడా తమ వంతుగా సామగ్రి నిల్వ కేంద్రాల వద్ద వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.

అనుమానితుల కదలికలపై నిఘా పెట్టాలని, వారి రాకపోకలను గమనిస్తూ అవసరమైతే ప్రశ్నించాలని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధానిలో అలజడి సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టు తేలితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, అలాంటి వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
Capital City Security
CC Cameras
Construction Fires
Security Measures
DGP Harish Kumar Gupta
Intelligence Chief Mahesh Kumar Ladda
Guntur SP Vakul Jindal

More Telugu News