టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేసింది.. రూ.6.99 లక్షలకే కొత్త కారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేసింది.. రూ.6.99 లక్షలకే కొత్త కారు!

Toyota Glanza Facelift launched in India starting at 699 lakh
  • గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ ప్రారంభ ధర రూ.6.99 లక్షలు
  • టాప్‌ వేరియంట్‌ ధర రూ.10.49 లక్షలు
  • కొత్త 1.2 లీటర్‌ మూడు సిలిండర్ల ఇంజిన్‌
  • పెట్రోల్‌, సీఎన్‌జీ ఆప్షన్లు, లెవల్‌-2 ఏడీఏఎస్‌, ఆరు ఎయిర్‌బ్యాగులు
  • వెంటిలేటెడ్‌ సీట్లు, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఫీచర్లు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ భారత మార్కెట్లో కొత్త గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధరలు రూ.6.99 లక్షల నుంచి రూ.10.49 లక్షల వరకు ఉన్నాయి. కొత్త ఇంజిన్‌తో పాటు లెవల్‌-2 ఏడీఏఎస్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లను ఇందులో అందించింది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ E, S, G, V, V (O) అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది.

కొత్త ఇంజిన్‌.. పెట్రోల్‌, సీఎన్‌జీ ఆప్షన్లు
కొత్త గ్లాంజాలో ప్రధాన మార్పు ఇంజిన్‌ విషయంలోనే జరిగింది. గతంలో ఉన్న నాలుగు సిలిండర్ల ఇంజిన్‌ స్థానంలో మారుతీ సుజుకీ Z12E 1.2 లీటర్‌ మూడు సిలిండర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ను తీసుకొచ్చారు. ఇది పెట్రోల్‌, సీఎన్‌జీ రెండు రకాల ఇంధనాలతో పనిచేస్తుంది.

పెట్రోల్‌ వెర్షన్‌ 83 బీహెచ్‌పీ పవర్‌, 112 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో 70 బీహెచ్‌పీ పవర్‌, 102 ఎన్ఎం టార్క్‌ అందిస్తుంది. రెండు వెర్షన్లలోనూ 5 స్పీడ్‌ మాన్యువల్‌, 5 స్పీడ్‌ ఏఎంటీ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉన్నాయి. సీఎన్‌జీ వెర్షన్‌లోనూ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఎంపికను అందించడం ప్రత్యేకత. కొత్త ఇంజిన్‌ గత మోడల్‌తో పోలిస్తే 7 బీహెచ్‌పీ పవర్‌, 1 ఎన్ఎం టార్క్‌ తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అయితే మైలేజీ మెరుగుపడుతుందని టయోటా చెబుతోంది. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఐడిల్‌ స్టార్ట్‌/స్టాప్‌ ఫీచర్‌నూ ఇచ్చింది.

డిజైన్‌లో స్వల్ప మార్పులు
గ్లాంజా కొత్త మోడల్‌లో ముందు భాగంలో పెద్ద గ్రిల్‌, శాటిన్‌ ఫినిష్‌ డిజైన్‌ అంశాలు కనిపిస్తాయి. ఎల్‌ఈడీ ఫాగ్‌ ల్యాంపుల డిజైన్‌ను మార్చారు. టయోటా లోగోను బానెట్‌ కింద ఉన్న భాగానికి మార్చారు. ఏడీఏఎస్‌ కోసం రాడార్‌ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. షార్క్‌ ఫిన్‌ యాంటెన్నాను కూడా జోడించారు. డిజిటల్‌ టీల్‌ గ్రీన్‌, బ్లూయిష్‌ బ్లాక్‌ అనే రెండు కొత్త రంగుల్లోనూ ఈ కారు లభిస్తుంది. సైడ్‌, వెనుక భాగాల్లో పెద్దగా మార్పుల్లేవు. 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, క్రోమ్‌ డోర్‌ హ్యాండిల్స్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంపులు కొనసాగుతున్నాయి.

కొత్త ఫీచర్లు.. భద్రతకు ప్రాధాన్యం
కారులో ముందు సీట్లకు వెంటిలేషన్‌ సదుపాయం కల్పించారు. ప్రత్యేక కూలింగ్‌ వెంట్‌తో కూడిన వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌ను ఇచ్చారు. నాలుగు స్పీకర్లు, రెండు ట్వీటర్లతో క్లారియన్‌ ఆడియో సిస్టమ్‌ను జోడించారు.

లెవల్‌-2 ఏడీఏఎస్‌తో పాటు టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (టీపీఎంఎస్‌) కొత్తగా వచ్చాయి. ఇప్పటికే ఉన్న 9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, హెడ్‌-అప్‌ డిస్‌ప్లే, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వెనుక ఏసీ వెంట్లు కొనసాగుతున్నాయి. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, హిల్‌-హోల్డ్‌ కంట్రోల్‌, ఐసోఫిక్స్‌ చైల్డ్‌ సీట్‌ యాంకర్లను అందించారు.

మొత్తంగా డిజైన్‌లో భారీ మార్పుల కంటే మైలేజీ, సౌకర్యాలు, భద్రతా ఫీచర్లపై టయోటా దృష్టి పెట్టింది.
Advertisement
Toyota Glanza
Toyota Glanza Facelift price
Toyota Glanza ADAS features
New Toyota Glanza CNG
Toyota Kirloskar Motor India
Premium hatchback India

More Telugu News