ఐపీఎల్‌ 2027కు ముందే సన్‌రైజర్స్‌ కీలక నిర్ణయం.. తిరిగొచ్చిన కీలక బౌలర్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐపీఎల్‌ 2027కు ముందే సన్‌రైజర్స్‌ కీలక నిర్ణయం.. తిరిగొచ్చిన కీలక బౌలర్‌!

Sunrisers Hyderabad major decision before IPL 2027 as key bowler returns
  • నటరాజన్‌ తిరిగి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు
  • రూ.5 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌లో చేరనున్న పేసర్‌
  • ఢిల్లీ నుంచి సన్‌రైజర్స్‌కు నటరాజన్‌ మార్పు
  • జీషన్‌ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు బదిలీ
  • అన్సారీ ధర రూ.40 లక్షలు
ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య కీలక ఆటగాళ్ల ట్రేడ్‌ జరిగింది. భారత ఎడమచేతి పేసర్‌ టీ.నటరాజన్‌ తిరిగి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులోకి రానుండగా.. లెగ్‌ స్పిన్నర్‌ జీషన్‌ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారనున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్‌ అధికారికంగా ప్రకటించింది.

నటరాజన్‌ 2020 నుంచి 2024 వరకు సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు రూ.5 కోట్ల ధరతో తిరిగి హైదరాబాద్‌ జట్టులో చేరనున్నాడు. 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా ఆ సీజన్‌లో తొలి 10 మ్యాచ్‌లకు దూరమైన నటరాజన్‌.. మే 5న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేశాడు. 2025 సీజన్‌లో రెండు మ్యాచ్‌లే ఆడాడు. 2026 సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు.

నటరాజన్‌కు ఐపీఎల్‌ 2024 సీజన్‌ అత్యంత విజయవంతమైంది. ఆ ఏడాది 19 వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఆ సీజన్‌లో హైదరాబాద్‌ జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 73 మ్యాచ్‌లు ఆడి 72 వికెట్లు పడగొట్టాడు. డెత్‌ ఓవర్లలో యార్కర్లు వేయడంలో పేరున్న నటరాజన్‌ రాకతో సన్‌రైజర్స్‌ పేస్‌ విభాగానికి మరింత బలం చేకూరనుంది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌తో పాటు యువ పేసర్లు ప్రఫుల్‌ హింగే, సకీబ్‌ హుస్సేన్‌, శ్రీలంక బౌలర్‌ ఇషాన్‌ మలింగ జట్టులో ఉన్నారు.

మరోవైపు జీషన్‌ అన్సారీ రూ.40 లక్షల ధరతో ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరనున్నాడు. 2025 సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరఫున 10 మ్యాచ్‌లు ఆడిన అతడికి 2026లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన అన్సారీ.. తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు సాధించాడు. ఢిల్లీ స్పిన్‌ విభాగంలో కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌కు తోడుగా అన్సారీ అందుబాటులో ఉండనున్నాడు.
Advertisement
T Natarajan
Sunrisers Hyderabad
Delhi Capitals
IPL 2027 Trade
Zeeshan Ansari
IPL Player Transfer

More Telugu News