ఫ్లేవర్డ్ మిల్క్ మార్కెట్‌లోకి రిలయన్స్.. 'జాయ్‌ల్యాండ్' బ్రాండ్ విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్లేవర్డ్ మిల్క్ మార్కెట్‌లోకి రిలయన్స్.. 'జాయ్‌ల్యాండ్' బ్రాండ్ విడుదల

Reliance enters flavored milk market with Joyland brand launch
  • 'జాయ్‌ల్యాండ్' పేరుతో కొత్త పానీయం విడుదల
  • రూ.20 ధరతో తమిళనాడులో తొలి విడత అమ్మకాలు
  • అమూల్, ఐటీసీ వంటి బ్రాండ్లకు గట్టి పోటీ
  • దేశవ్యాప్తంగా విస్తరించేందుకు రిలయన్స్ ప్రణాళికలు
దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్, తన కన్స్యూమర్ ఉత్పత్తుల వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. కూల్ డ్రింక్స్ రంగంలో 'కాంపా'తో సంచలనం సృష్టించిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL), తాజాగా రెడీ-టు-డ్రింక్ (RTD) డెయిరీ పానీయాల విభాగంలోకి అడుగుపెట్టింది. 'జాయ్‌ల్యాండ్' పేరుతో ఫ్లేవర్డ్ మిల్క్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. తొలి విడతగా తమిళనాడులో ఈ ఉత్పత్తిని ప్రవేశపెట్టింది.

'అందుబాటు ధరలో అంతర్జాతీయ నాణ్యత' అనే నినాదంతో రిలయన్స్ ఈ కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. జాయ్‌ల్యాండ్ ఫ్లేవర్డ్ మిల్క్ బాటిల్ ధరను రూ. 20గా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పానీయం స్ట్రాబెర్రీ, వెనిల్లా ఫ్లేవర్లలో అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని ఫ్లేవర్లను పరిచయం చేయనున్నట్లు కంపెనీ సూచనప్రాయంగా తెలిపింది.

కూల్ డ్రింక్స్ విభాగంలో 'కాంపా' బ్రాండ్‌ను కేవలం రూ. 10కే అందించి మార్కెట్లో రిలయన్స్‌ తీవ్రమైన పోటీని సృష్టించిన విషయం తెలిసిందే. ఫ్లేవర్డ్ మిల్క్ విషయంలో మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న అముల్ కూల్, ఐటీసీ సన్‌ఫీస్ట్ స్మూద్, మదర్ డెయిరీ, నందిని, కేవిన్స్ వంటి దిగ్గజ బ్రాండ్ల ధరలకు సమానంగా జాయ్‌ల్యాండ్ ధరను నిర్ణయించింది. దీంతో ఈ విభాగంలో పోటీ మరింత పెరగనుంది.

భారత్‌లో ఫ్లేవర్డ్ మిల్క్ మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. యూరోమానిటర్ నివేదిక ప్రకారం, 2021లో రూ. 4,420 కోట్లుగా ఉన్న ఈ మార్కెట్, 2026 నాటికి రూ. 8,360 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతోనే రిలయన్స్ ఈ విభాగంలోకి ప్రవేశించింది. తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ టి.కృష్ణకుమార్ తెలిపారు. తమిళనాడుతో ప్రారంభించి, త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ ఉత్పత్తులను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Advertisement
Reliance
Joyland flavored milk
Reliance Consumer Products
Joyland brand launch
Flavored milk market India

More Telugu News