Reza Najafi: నాటాంజ్ అణుక్షేత్రంపై దాడి జరిగిందన్న ఇరాన్ రాయబారి.. ఖండించిన ఐఏఈఏ

Reza Najafi Iran Ambassador Accuses Israel of Attack on Natanz IAEA Responds
  • ప్రధాన అణుక్షేత్రంపై దాడి చేశాయన్న ఐఏఈఏలోని ఇరాన్ రాయబారి
  • ఈ దాడి చట్టవిరుద్ధమని ఆందోళన
  • దాడి చేసినట్లు ఆధారాలు లేవన్న ఐఏఈఏ
ఇజ్రాయెల్, అమెరికా నాటాంజ్‌లోని తమ ప్రధాన అణుక్షేత్రంపై దాడి చేశాయని ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)లో ఇరాన్ రాయబారి రెజా నజాఫీ ఆరోపించారు. ఈ దాడి చట్టవిరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా నేరపూరిత, అనాగరిక చర్య అన్నారు. ఇరాన్ శాంతియుత సురక్షిత అణు సౌకర్యాలపై ఆదివారం మరోసారి దాడి జరిగిందని పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయాలనుకోవడం పూర్తిగా అబద్ధమని చెప్పారు.

అయితే ఇరాన్ రాయబారి ఆరోపణలను ఐఏఈఏ ఖండించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్‌లోని ఏ అణు కేంద్రాలు దెబ్బతినలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) తెలిపింది. వైమానిక దాడుల్లో ఇరాన్‌లోని అణు కేంద్రాలు దెబ్బతిన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఐఏఈఏ అధిపతి తెలిపారు.

ఈ విషయమై ఇరాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. వారి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని, అలాగే ఇరాన్ సరిహద్దు దేశాల్లో రేడియేషన్ స్థాయిలు పెరిగిన సంకేతాలు కూడా లేవని వెల్లడించారు.

మరోవైపు, ఇరాన్‌‌పై సైనిక చర్యను అమెరికా-ఇజ్రాయెల్ సమర్థించుకుంటున్నాయి. ఇరాన్ అణుసామర్థ్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన ఉద్దేశమని చెబుతున్నాయి. సొంతంగా అణ్వాయుధాల తయారీలో ఇరాన్ తుది దశలో ఉందని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపించాయి.
Reza Najafi
Iran
IAEA
Natanz nuclear facility
Israel
nuclear program
nuclear weapons
United States

More Telugu News