Nara Lokesh: కాకినాడ జిల్లా బాణసంచా దుర్ఘటన కలచివేసింది: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Reacts to Kakinada Fire Accident Tragedy
  • కాకినాడ జిల్లా పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన లోకేశ్
  • బాధితుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
  • సామర్లకోటలో బాణసంచా కేంద్రం పేలి 18 మంది దుర్మరణం
  • సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి బయల్దేరిన హోంమంత్రి అనిత
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పెదపూడి రోడ్డులో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటలకు అందని విషాదమని, ఊహించని ఈ ప్రమాదంలో పలువురు మృత్యువాత పడటం తనను ఎంతగానో కలచివేసిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు నివాళులు అర్పించిన ఆయన.. వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు.

సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు మధ్య ఉన్న ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఈ మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ బిందుమాధవ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు హోంమంత్రి అనిత హుటాహుటిన ఘటనా స్థలానికి బయల్దేరారు.

కాగా, ఈ దుర్ఘటనలో బాణసంచా పరిశ్రమ యజమాని అడబాల వీరబాబు తండ్రి శ్రీను కూడా మృతి చెందారు. మృతుల్లో ఇప్పటివరకు 11 మందిని అధికారులు గుర్తించారు. వీరిలో అడబాల శ్రీను, మందపల్లి చిన్ని, కడింపల్లి కృపమ్మ, సాధనాల సత్యవేణి, కడింపల్లి ధనరాజు, నిమ్మాడ కరుణ, వట్లూరి రవి, గొడతా నాని, గంపల మంగ, గొడతా రాము, గొడతా మహేశ్ ఉన్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Nara Lokesh
Kakinada fire accident
firecracker factory explosion
Andhra Pradesh accident
Samarlakota blast
Chandrababu Naidu
Home Minister Anita
fireworks industry
Veerababu
Shan Mohan

More Telugu News