Nara Lokesh: మాటలకే పరిమితం కాకుండా గ్రౌండింగ్‌కే మా ప్రాధాన్యత: బ్లూ జెట్ హెల్త్ కేర్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేశ్

Nara Lokesh Focuses on Grounding Projects Blue Jet Healthcare Launch
  • అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.2,300 కోట్ల పెట్టుబడితో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఏర్పాటు
  • ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా అభివర్ణించిన మంత్రి లోకేశ్
  • పరిశ్రమ ద్వారా 1,750 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు
  • దేశంలోనే ప్రముఖ ఔషధ తయారీ కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దే దిశగా అడుగులు
  • వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెం ఇండస్ట్రియల్ పార్క్‌లో ప్రముఖ ఫార్మా దిగ్గజం 'బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్' (బీజేహెచ్ఎల్) గ్రీన్‌ఫీల్డ్ ఔషధ తయారీ యూనిట్‌కు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, పరిశ్రమలు క్షేత్రస్థాయిలో ఏర్పాటయ్యేలా (గ్రౌండింగ్) తమ ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందని స్పష్టం చేశారు.

ఏపీలో పెట్టుబడులకు మూడు బలమైన కారణాలు
ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడిదారులు తమ గమ్యస్థానంగా ఎంచుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని లోకేశ్ విశ్లేషించారు.
మొదటిది 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'. ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన మరుక్షణం నుంచి ఆ ప్రాజెక్టును ప్రభుత్వం తమ సొంత ప్రాజెక్టుగా భావిస్తుందని, పెట్టుబడిదారులను బయటివారిలా కాకుండా అభివృద్ధిలో భాగస్వాములుగా చూస్తామని చెప్పారు.
రెండవది 'విశ్వసనీయత'. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే రాష్ట్రానికి అతిపెద్ద బలమని, ఏపీ ప్రభుత్వం మాట ఇస్తే తప్పక నిలబెట్టుకుంటుందన్న భరోసా పెట్టుబడిదారుల్లో ఉందని అన్నారు.
మూడవది 'డబుల్ ఇంజిన్ సర్కార్'. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న బలమైన నాయకత్వం వల్ల నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయని, ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం కాకుండా శరవేగంగా కార్యరూపం దాలుస్తున్నాయని మంత్రి వివరించారు.

ఒక సంభాషణ నుంచి సాకారమైన ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని మంత్రి వివరించారు. తన సొంత నియోజకవర్గం మంగళగిరికి చెందిన బ్లూ జెట్ సంస్థ సీనియర్ అధికారి వేణుబాబు గతేడాది తనను కలిసినప్పుడు, ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టకూడదని ప్రశ్నించారన్నారు. ఆ ఆవేదన, ఆకాంక్ష నుంచే ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుందని తెలిపారు. వెంటనే సంబంధిత శాఖలను అప్రమత్తం చేసి, రాంబిల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్-2లో 102 ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా, అనుమతులన్నీ వేగంగా మంజూరు చేశామని గుర్తుచేశారు. ఒక సామాన్య సంభాషణ నుంచి భూమిపూజ వరకు సాగిన ఈ ప్రయాణం ఏపీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు.

రూ.2,300 కోట్ల పెట్టుబడి - 2,000 మందికి ఉపాధి
బ్లూ జెట్ సంస్థ దాదాపు రూ.2,300 కోట్ల భారీ పెట్టుబడితో ఈ యూనిట్‌ను నెలకొల్పుతోంది. దీని ద్వారా 1,750 మందికి ప్రత్యక్షంగానూ, 250 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది. ఇక్కడ 2,000 కిలోలీటర్ల సామర్థ్యంతో ఏపీఐ, ఇంటర్మీడియట్స్ తయారీ యూనిట్‌ను అభివృద్ధి చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ 'జీరో లిక్విడ్ డిశ్చార్జ్' వంటి అత్యాధునిక సాంకేతికతను ఇక్కడ వినియోగించనున్నారు.

ఎకనామిక్ హబ్‌గా ఉత్తరాంధ్ర
విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు ఉత్తరాంధ్ర వైపు చూస్తున్నాయన్నారు. విశాఖ పోర్ట్ కనెక్టివిటీ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఈ ప్రాంతానికి అదనపు బలమని పేర్కొన్నారు. ఫార్మా, మెడికల్ డివైసెస్, పెట్రోకెమికల్స్ రంగాలకు ఉత్తరాంధ్రను కేంద్ర బిందువుగా మారుస్తామని భరోసా ఇచ్చారు.

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ఏకైక అజెండా అని మంత్రి పునరుద్ఘాటించారు. దేశానికి వస్తున్న పెట్టుబడి ప్రతిపాదనల్లో 25.3 శాతం ఏపీకే రావడం గర్వకారణమన్నారు. బ్లూ జెట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్, ప్రభుత్వం ఎల్లప్పుడూ వాట్సాప్ మెసేజ్ దూరంలోనే అందుబాటులో ఉంటూ సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
Nara Lokesh
Andhra Pradesh
Blue Jet Healthcare
Anakapalli
AP Industrial Development
Ramilli
Pharmaceuticals
Investment AP
Vizag Economic Region
Job Creation

More Telugu News