YS Sharmila: ముక్కుపచ్చలారని పసిబిడ్డపై గంజాయి మత్తులో జరిగిన పైశాచికం ఇది: షర్మిల

YS Sharmila Condemns Madanapalle Rape Incident
షార్ట్స్‌లో చూడండి
మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై జరిగిన హత్యాచారం అత్యంత దారుణమని, గంజాయి మత్తులో ముక్కుపచ్చలారని పసిబిడ్డపై జరిగిన ఈ పైశాచిక ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ దారుణ ఘటన పట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, బాలిక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో మాదకద్రవ్యాలు ఏరులై పారుతున్నాయనడానికి మదనపల్లె ఘటనే నిదర్శనమని షర్మిల ఆరోపించారు. డ్రగ్స్, గంజాయిపై డేగ కన్ను పెట్టామని, ఉక్కుపాదం మోపుతామని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడమంతా ఆర్భాటమేనని విమర్శించారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా తూతూ మంత్రంగానే మిగిలిపోయిందని ఆమె దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని విమర్శించారు.

బాధిత బాలిక కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పైశాచిక ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో వ్యక్తిగతంగా దృష్టి సారించాలని, గంజాయి, డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపడంతో పాటు నిరంతరం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడటంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని షర్మిల స్పష్టం చేశారు.
Go Back to Shorts
YS Sharmila
Andhra Pradesh
Madanapalle
rape case
minor girl
ganja
drugs
Chandrababu Naidu
TDP government
narcotics control

More Telugu News