Gold prices: బంగారం, వెండి ధరలు మ‌ళ్లీ ఢమాల్

Gold Silver Prices Crash in Indian Market
  • ఇవాళ‌ బంగారం, వెండి ధరలు భారీగా పతనం
  • 10 గ్రాముల బంగారం రూ. 1.52 లక్షలకు క్షీణత
  • రూ. 2.47 లక్షలకు ప‌డిపోయిన కిలో వెండి ధర  
  • ఎంసీఎక్స్‌లో వెండి ఫ్యూచర్స్ 10 శాతం ప‌త‌నమైన‌ వైనం
  • బలహీన అంతర్జాతీయ సంకేతాలే పతనానికి కారణం
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా కుప్పకూలాయి. రెండు రోజులుగా కొనసాగుతున్న లాభాలకు బ్రేక్ పడింది. ఇండియా బులియన్స్ వెబ్‌సైట్ ప్రకారం కిలో వెండి ధర రూ. 2.47 లక్షలకు పడిపోగా, 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గి రూ. 1.52 లక్షల వద్దకు చేరింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, డాలర్ బలపడటం వంటి కారణాలతో ఈ పతనం చోటుచేసుకుంది.

గత రెండు రోజులుగా లాభాల్లో పయనించిన వెండి, గురువారం నాటి మార్కెట్ క్రాష్ తర్వాత కోలుకోలేకపోయింది. స్పాట్ మార్కెట్లో వెండి ధర ఏకంగా 20 శాతం పతనమై ఔన్సుకు 71 డాలర్ల దిగువకు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మార్చి నెల వెండి ఫ్యూచర్స్ ఏకంగా రూ. 26,850 (10శాతం) తగ్గి కిలో రూ. 2,42,000 వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో దీని ధర రూ. 2,68,850గా ఉంది. బంగారం ఫ్యూచర్స్‌లోనూ ఇదే ధోరణి కనిపించింది. ఏప్రిల్ కాంట్రాక్ట్ రూ. 2,310 (1.51శాతం) తగ్గి 10 గ్రాములు రూ. 1,50,736 వద్ద ముగిసింది.

గత నెలలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అయితే, ఈ పెరుగుదల ఎక్కువ కాలం నిలవదని, ధరలు చాలా వేగంగా పెరిగాయని విశ్లేషకులు హెచ్చరించారు. వారి అంచనాలకు అనుగుణంగానే గత వారం నుంచి మార్కెట్లలో భారీ దిద్దుబాటు మొదలైంది.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,180గా ఉండగా, ఢిల్లీలో రూ. 1,51,910గా ఉంది. దక్షిణ భారత నగరాల్లో ధరలు అత్యధికంగా ఉన్నాయి. చెన్నైలో తులం బంగారం ధర రూ. 1,52,620 కాగా, హైదరాబాద్‌లో రూ. 1,52,420, బెంగళూరులో రూ. 1,52,300గా నమోదైంది.

వెండి విషయానికొస్తే, చెన్నైలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 2,47,590గా ఉంది. హైదరాబాద్‌లో రూ. 2,47,260, బెంగళూరులో రూ. 2,47,060 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 2,46,870గా, ఢిల్లీలో రూ. 2,46,440గా ఉంది. కోల్‌కతాలో రూ. 2,46,540 వద్ద కొనసాగుతోంది.
Gold prices
Silver prices
Bullion market
India bullion
Commodity market
MCX
Rupee
Mumbai gold price
Chennai silver price
Hyderabad gold price

More Telugu News