నీళ్ల గ్లాసు నుంచి చేతులు కలపడం వరకు.. రాష్ట్రపతి భద్రతలో ఇన్ని జాగ్రత్తలా!

నీళ్ల గ్లాసు నుంచి చేతులు కలపడం వరకు.. రాష్ట్రపతి భద్రతలో ఇన్ని జాగ్రత్తలా!

President of India Security From Water Glasses to Handshakes Key Protocols Revealed
  • ముర్ము మాజీ ఏడీసీ రిషబ్‌ సాంబ్యాల్‌ కీలక విషయాలు
  • ఏడీసీకి అప్రమత్తత అత్యంత ముఖ్యమని వెల్లడి
  • అలసటలోనూ పరిసరాలను గమనించేలా శిక్షణ ఇస్తారని చెప్పిన సాంబ్యాల్‌
  • రాష్ట్రపతిని కలిసేవారికి ముందుగానే భద్రతా బృందం బ్రీఫ్‌
  • రాష్ట్రపతి నీరు, ఆహారంపైనా ప్రత్యేక భద్రతా చర్యలు
రాష్ట్రపతి ఎక్కడికి వెళ్లినా ఆమె వెంట ఓ సైనిక అధికారి కనిపిస్తారు. అధికారిక కార్యక్రమం కావొచ్చు.. విదేశీ పర్యటన కావొచ్చు.. ముఖ్యమైన సమావేశం కావొచ్చు. రాష్ట్రపతికి కొన్ని అడుగుల దూరంలో ఆ అధికారి తప్పక ఉంటారు. ఆ అధికారే ‘ఎయిడ్‌ డి క్యాంప్‌’ (ఏడీసీ). బయటకు చూస్తే రాష్ట్రపతి వెంట నడిచే అధికారి మాత్రమే అనిపించినా.. ఏడీసీ బాధ్యతలు మాత్రం చాలా కీలకం. మాజీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఏడీసీగా పనిచేసిన మేజర్‌ రిషబ్‌ సింగ్‌ సాంబ్యాల్‌ తాజాగా వెల్లడించిన విషయాలు ఈ బాధ్యత ఎంత కఠినంగా ఉంటుందో చెబుతున్నాయి.

చుట్టూ ఏం జరుగుతుందో గమనించాలి
రాజ్‌ శమానీ నిర్వహించే ‘ఫిగరింగ్‌ అవుట్‌’ పాడ్‌కాస్ట్‌లో సాంబ్యాల్‌ తన అనుభవాలను పంచుకున్నారు. సుమారు మూడేళ్ల పాటు రాష్ట్రపతి ముర్ముకు ఏడీసీగా పనిచేసిన ఆయన.. ఈ ఉద్యోగంలో అప్రమత్తతే అత్యంత ముఖ్యమని చెప్పారు.

సైనిక శిక్షణలో అలసిపోయిన పరిస్థితుల్లోనూ చుట్టూ ఉన్న విషయాలను గమనించేలా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారని వివరించారు. కొన్నిసార్లు 70 నుంచి 80 కిలోల బరువు మోసేలా చేస్తారని చెప్పారు. ఆహారం, నీరు, నిద్ర లేకుండా ఉంచిన తర్వాత కూడా పరిసరాలను గమనించాల్సి ఉంటుందని తెలిపారు.

చెట్టు వెనుక హెల్మెట్‌ పెట్టి పరీక్ష
శిక్షణలో భాగంగా దారిలో అక్కడక్కడా కొన్ని వస్తువులను ఉద్దేశపూర్వకంగా ఉంచుతారని సాంబ్యాల్‌ చెప్పారు. ఉదాహరణకు చెట్టు వెనుక హెల్మెట్‌ పెడతారు. శిక్షణ పూర్తయ్యాక దారిలో ఏం చూశావని ప్రశ్నిస్తారు. అలసిపోయినా చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించే సామర్థ్యాన్ని పెంచడమే దీని ఉద్దేశమని వివరించారు.

రాష్ట్రపతి వంటి అత్యంత ముఖ్యమైన వ్యక్తికి సమీపంగా పనిచేసే సమయంలో ఈ అప్రమత్తత మరింత అవసరమని చెప్పారు. అయితే రాష్ట్రపతికి భద్రత కల్పించే బాధ్యత ఒక్క ఏడీసీదే కాదని స్పష్టం చేశారు. ప్రత్యేక భద్రతా విభాగాలతో కలిసి మొత్తం వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు.

చేతులు కలపడం కూడా..
రాష్ట్రపతిని కలిసేందుకు వచ్చే ప్రతి వ్యక్తి ఉద్దేశాన్ని ముందుగానే తెలుసుకోవడం సాధ్యం కాదని సాంబ్యాల్‌ చెప్పారు. అందుకే చేతులు కలపడం, పాదాలకు నమస్కరించడం వంటి విషయాల్లోనూ భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని వివరించారు.

రాష్ట్రపతిని కలిసే వారికి ముందుగానే సూచనలు ఇస్తారని తెలిపారు. సమావేశం సమయంలో తాను కూడా అక్కడే ఉంటానని చెప్పారు. ఎవరికైనా ఒక్కసారిగా భావోద్వేగం కలిగినా, అనూహ్యంగా ఏదైనా చేయాలనిపించినా వెంటనే స్పందించేలా భద్రతా బృందం సిద్ధంగా ఉంటుందని వివరించారు.

నీళ్లు, ఆహారంపైనా ప్రత్యేక నిఘా
రాష్ట్రపతి తాగే నీటి గ్లాసు విషయంలోనూ జాగ్రత్తలు ఉంటాయని సాంబ్యాల్‌ వెల్లడించారు. ఆ గ్లాసును ఎవరు అక్కడ ఉంచారు? అందులో ఏమైనా ఉందా? అన్నది కూడా భద్రతా కోణంలో పరిశీలిస్తారని చెప్పారు.

ఆహారానికి కూడా ప్రత్యేక భద్రతా విధానం ఉంటుందని తెలిపారు. రాష్ట్రపతి బయట భోజనం చేసే సందర్భాల్లో ముందుగానే చెఫ్‌ను పంపిస్తారని చెప్పారు. ఏం వండాలి? ఏ పదార్థాలు వాడాలి? ఏవి వాడకూడదు? అన్న విషయాలను ముందుగానే సూచిస్తారని వివరించారు.

ఏడీసీ బాధ్యత కేవలం భద్రత కాదు
రాష్ట్రపతి అవసరాలను సమన్వయం చేయడం కూడా ఏడీసీ బాధ్యతల్లో భాగమేనని సాంబ్యాల్‌ చెప్పారు. ప్రధానిని రాష్ట్రపతి సంప్రదించాలనుకుంటే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ప్రక్రియను సమన్వయం చేయాల్సి ఉంటుందని తెలిపారు.

రాష్ట్రపతిని కలవాలనుకునే ఎవరైనా అధికారిక మార్గంలో అభ్యర్థన పంపవచ్చని చెప్పారు. వచ్చిన అభ్యర్థనలను రాష్ట్రపతి కార్యాలయ సిబ్బంది పరిశీలిస్తారని తెలిపారు. ప్రాధాన్యత ఆధారంగా సమావేశాలను ఖరారు చేస్తారని వివరించారు. రాష్ట్రపతి వ్యక్తిగత గదిలోకి మాత్రం సిబ్బందికి మాత్రమే ప్రవేశం ఉంటుందని చెప్పారు.

సుమారు 12 ఏళ్ల సైనిక సేవ తర్వాత సాంబ్యాల్‌ ఆర్మీ నుంచి ముందస్తు పదవీ విరమణ చేశారు.
Advertisement
Droupadi Murmu
President of India Security
Aide-de-Camp
Major Rishab Singh Sambyal
Presidential Security Protocols
Indian Army ADC

More Telugu News