బ్రిక్స్ వేదికగా మోదీ-జిన్‌పింగ్ భేటీ.. కలిసి ముందుకు సాగాలన్న చైనా అధ్యక్షుడు

బ్రిక్స్ వేదికగా మోదీ-జిన్‌పింగ్ భేటీ.. కలిసి ముందుకు సాగాలన్న చైనా అధ్యక్షుడు

Narendra Modi and Xi Jinping meet at BRICS summit Chinese President calls for cooperation
  • బ్రిక్స్ సదస్సు వేళ మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమావేశం
  • భారత్, చైనా కలిసి నడవాలని పిలుపునిచ్చిన జిన్‌పింగ్
  • మోదీతో 21 సార్లు సమావేశమయ్యానన్న చైనా అధ్యక్షుడు
  • భారత్‌తో దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందాలకు సిద్ధమని ప్రకటన
న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్-2026 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక అంశాలపై ఈ సందర్భంగా వారు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఇరు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సుమారు ఏడేళ్ల విరామం తర్వాత జిన్‌పింగ్ భారత్‌లో పర్యటిస్తుండటంతో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ, ప్రపంచంలోని రెండు అతిపెద్ద దేశాలైన భారత్, చైనాలు కలిసికట్టుగా సాగాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ వేగవంతమైన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. పరస్పర సహకారంతో, ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకుంటూ పురోగమించాలని ఆయన సూచించారు. భారత్‌తో దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

బ్రిక్స్ సదస్సు ఆహ్వానం తన పుట్టినరోజు నాడే అందిందని జిన్‌పింగ్ గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీతో తాను ఇప్పటివరకు 21 సార్లు సమావేశమయ్యానని, తమ నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు స్థిరమైన దిశలో పయనిస్తున్నాయని ఆయన వివరించారు.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధంపై కూడా జిన్‌పింగ్ స్పందించారు. ఈ యుద్ధం వల్ల ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇది అంతర్జాతీయ సమాజ ప్రయోజనాలకు విఘాతమని అన్నారు. శాశ్వత, సమగ్ర కాల్పుల విరమణ దిశగా రాజకీయ పరిష్కారం కోసం అన్ని పక్షాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు బ్రిక్స్ సభ్య దేశాలతో కలిసి చైనా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్‌కు అందించిన మద్దతు, సహకారానికి చైనాకు కృతజ్ఞతలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించేందుకు ఈ సమావేశం ఒక చక్కని వేదికగా నిలిచిందని, చైనాతో పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు ఆయన వెల్లడించారు. బ్రిక్స్ సమ్మిట్ నేపథ్యంలో చైనా అందించిన మద్దతు, సహకారానికి జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ద్వైపాక్షిక సహకారంపై చర్చించేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది బ్రిక్స్‌కు చైనా సారథ్యం

బ్రిక్స్ కూటమికి 2027లో చైనా అధ్యక్షత వహించనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని నిర్మించి భవిష్యత్ ప్రణాళికలు రచిస్తామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న 19వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు కూడా చైనానే ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ 'ఎక్స్' వేదికగా ధ్రువీకరించారు. బ్రిక్స్ సహకారంలో మూడో స్వర్ణ దశాబ్దానికి నాంది పలుకుతామని జిన్‌పింగ్ పేర్కొన్నట్లు ఆమె తెలిపారు.
Advertisement
Narendra Modi
Xi Jinping
BRICS 2026 Summit
India China Relations
New Delhi
Bilateral Meeting

More Telugu News