బ్రిక్స్‌లో భారత్‌ దౌత్య విజయం.. విభేదాల మధ్యలోనూ సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయం

బ్రిక్స్‌లో భారత్‌ దౌత్య విజయం.. విభేదాల మధ్యలోనూ సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయం

India diplomatic victory in BRICS consensus on joint declaration despite differences
  • భారత్‌ చర్చలతో విభేదాలను పరిష్కరించినట్లు సమాచారం
  • తెల్లవారుజామున 4 గంటల వరకు సంప్రదింపులు సాగినట్లు వెల్లడి
  • ఇరాన్‌, సౌదీ, యూఏఈ విభేదాల నేపథ్యంలో ఒప్పందం
  • మేలో సంయుక్త ప్రకటనకు బ్రిక్స్‌ దేశాలు అంగీకరించని వైనం
  • గ్లోబల్‌ సౌత్‌ ప్రయోజనాలపై భారత్‌ ప్రత్యేక దృష్టి
ప్రపంచ రాజకీయాల్లో విభేదాలు కొనసాగుతున్న వేళ బ్రిక్స్‌లో భారత్‌ కీలక దౌత్య విజయం సాధించింది. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించి సంయుక్త ప్రకటనకు మార్గం సుగమం చేసింది. న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతున్న 18వ బ్రిక్స్‌ సదస్సు తొలి రోజున ఈ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.

భారత్‌ శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజామున 4 గంటల వరకు సభ్య దేశాలతో వరుసగా చర్చలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పలు వివాదాస్పద అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు భారత్‌ తీవ్రంగా ప్రయత్నించినట్లు పేర్కొన్నాయి.

ముఖ్యంగా ఇరాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ ఒకే బ్రిక్స్‌ వేదికలో ఉండటం ఈ చర్చలను మరింత క్లిష్టంగా మార్చింది. పశ్చిమాసియాలో యుద్ధాలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దేశాల మధ్య ఉన్న విభేదాలను అధిగమించి ఏకాభిప్రాయం సాధించడం పెద్ద దౌత్య సవాలుగా మారింది.

ఇరాన్‌, యూఏఈ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మేలో జరిగిన బ్రిక్స్‌ మంత్రివర్గ సమావేశం తొలిసారి సంయుక్త ప్రకటన లేకుండానే ముగిసింది. అప్పట్లో భారత్‌ ఛైర్‌ స్టేట్‌మెంట్‌, ఔట్‌కమ్‌ డాక్యుమెంట్‌ను మాత్రమే విడుదల చేసింది. ఈసారి మాత్రం సంయుక్త ప్రకటనకు సభ్య దేశాలు అంగీకరించాయి.

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ యుద్ధానికి బదులుగా చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనాలని పదేపదే చెబుతోంది. జీ20 అధ్యక్ష బాధ్యతల సమయంలో అనుసరించిన విధంగానే బ్రిక్స్‌లోనూ భారత్‌ గ్లోబల్‌ సౌత్‌ ప్రయోజనాలను ముందుకు తీసుకెళుతూ పశ్చిమ దేశాలకు వ్యతిరేక వేదికగా బ్రిక్స్‌ను మార్చకుండా బ్యాలెన్స్‌డ్‌ వైఖరిని కొనసాగిస్తోంది.

బ్రిక్స్‌లో సభ్య దేశాల సంఖ్య పెరగడం ఏకాభిప్రాయ సాధనను మరింత కష్టతరం చేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌, బ్రెజిల్‌ బ్రిక్స్‌ను ప్రధానంగా ఆర్థిక వేదికగా చూస్తుండగా.. చైనా, రష్యా దాన్ని భౌగోళిక రాజకీయ వేదికగా చూస్తున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి.
Advertisement
India
BRICS Summit
Narendra Modi
Joint Declaration
Global South
International Diplomacy

More Telugu News