ఏపీలో మారిన దసరా సెలవుల తేదీలు.. మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు
- ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం
- రెండు రోజుల ముందుగానే ప్రారంభం కానున్న సెలవులు
- ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్ ప్రకటన
ఉపాధ్యాయుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ విషయాన్ని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన వెల్లడించారు. "పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం" అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
వాస్తవానికి, విద్యాశాఖ ముందుగా జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉన్నాయి. అయితే, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అదనంగా రెండు రోజులు సెలవులు లభించనున్నాయి. అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.