Advertisement

రూ.3.6 కోట్ల డెన్మార్క్‌ ఫెలోషిప్‌ సాధించిన ఏపీ శాస్త్రవేత్త

Vimala Battineni wins prestigious 36 crore Denmark PhD fellowship
  • డారా ఫెలోషిప్‌ సాధించిన విమల బత్తినేని
  • ఏపీకి చెందిన శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం
  • సెప్టెంబర్‌ నుంచి డెన్మార్క్‌లో పీహెచ్‌డీ
  • ఎన్నో తిరస్కరణల తర్వాత దక్కిన అవకాశం
  • రేకులకుంటలో శాస్త్రవేత్తగా పనిచేసిన విమల
  • ఫాబా బీన్స్‌పై పరిశోధన చేయనున్న శాస్త్రవేత్త
ఎన్నోసార్లు పీహెచ్‌డీ దరఖాస్తులు తిరస్కరణకు గురైనా వెనక్కి తగ్గకుండా ప్రయత్నాలు కొనసాగించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శాస్త్రవేత్త విమల బత్తినేని అరుదైన ఘనత సాధించారు. డెన్మార్క్‌ ప్రతిష్ఠాత్మక డారా పీహెచ్‌డీ ఫెలోషిప్‌ను దక్కించుకున్నారు. దీని విలువ సుమారు 25 లక్షల డానిష్‌ క్రోనార్లు (దాదాపు రూ.3.6 కోట్లు). 2026 సెప్టెంబర్‌ నుంచి యూనివర్సిటీ ఆఫ్‌ సదర్న్‌ డెన్మార్క్‌లో మూడేళ్ల పీహెచ్‌డీ ప్రారంభించనున్నారు.

లింక్డిన్‌లో ఈ విషయాన్ని పంచుకున్న విమల.. ఈ విజయం వెనుక ఎన్నో తిరస్కరణలు, అనిశ్చితి దాగి ఉన్నాయని చెప్పారు. అనేక పీహెచ్‌డీ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, డారా ఫెలోషిప్‌కు చేసిన తొలి ప్రయత్నం కూడా విఫలమైందని గుర్తు చేశారు. అయితే ప్రతి తిరస్కరణ తనకు కొత్త పాఠం నేర్పిందని పేర్కొన్నారు.

విమల 2019 నుంచి 2023 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని రేకులకుంట హార్టికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌లో శాస్త్రవేత్తగా పనిచేశారు. అనంతరం భర్త ఉద్యోగరీత్యా డెన్మార్క్‌కు వెళ్లడంతో, అక్కడే పరిశోధన రంగంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఆమె చేపట్టనున్న ‘ఫాబా లూప్‌’ పరిశోధనలో ప్రొటీన్‌ అధికంగా ఉండే ఫాబా బీన్స్‌ సాగును విస్తరించడం ద్వారా సోయా దిగుమతులపై డెన్మార్క్‌ ఆధారపడడాన్ని తగ్గించవచ్చా అనే అంశాన్ని అధ్యయనం చేయనున్నారు. ఈ పరిశోధన ద్వారా ఆ దేశంలో ప్రొటీన్‌ స్వయం సమృద్ధితో పాటు పర్యావరణహిత వ్యవసాయానికి, సుస్థిర ఆహార వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ఈ ఫెలోషిప్‌ తన దశాబ్దకాల పరిశోధన ప్రయాణానికి కొనసాగింపుగా భావిస్తున్నానని విమల తెలిపారు. ఎన్నిసార్లు విఫలమైనా లక్ష్యాన్ని వదులుకోకుండా ప్రయత్నిస్తే విజయం తప్పకుండా దక్కుతుందనే సందేశాన్ని ఆమె ప్రయాణం మరోసారి చాటిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Vimala Battineni
Denmark PhD Fellowship
University of Southern Denmark
DARA Fellowship
Andhra Pradesh scientist
Faba Loop research

More Telugu News