Advertisement

జగన్ గందరగోళం సృష్టిస్తున్నారు: అమరావతిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్

Gottipati Ravi Kumar says Jagan is creating confusion over Amaravati
  • అమరావతి అభివృద్ధిని జగన్ కళ్లారా చూడాలన్న గొట్టిపాటి
  • అమరావతి అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్‌గా మారబోతోందని ధీమా
  • రాజధానిలో భవనాల నిర్మాణాలు అద్భుతంగా సాగుతున్నాయని వెల్లడి

రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్ అనవసర గందరగోళం సృష్టిస్తూ ప్రజలను తికమక పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. జగన్ కనీసం ఒక్కసారైనా నేరుగా వచ్చి అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లారా చూడాలని హితవు పలికారు. రాజధాని నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


అమరావతి త్వరలోనే ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్‌గా మారబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఇక్కడ భారీ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీతో పాటు ప్రముఖ కళాశాలలు ఏర్పాటు కాబోతున్నాయని వెల్లడించారు. అమరావతిలో భవనాల నిర్మాణాలు అద్భుతంగా సాగుతున్నాయని, భవిష్యత్తులో ఇది అత్యంత అద్భుతమైన నివాస యోగ్యమైన నగరంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఐకానిక్ భవనాలకు సంబంధించిన మొదటి డైమండ్ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి 12 ఫ్లోర్లు సిద్ధమవుతాయని ప్రకటించారు. అంతేకాకుండా ప్రాంతీయ అనుసంధానం కోసం త్వరలోనే ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రాబోతుందని స్పష్టం చేశారు.


రాజధాని నిర్మాణానికి తమ విలువైన భూములను త్యాగం చేసిన రైతుల చలవ వల్లే ఈరోజు అమరావతిలో ఇంతటి భారీ నిర్మాణాలు సాధ్యమవుతున్నాయని మంత్రి కొనియాడారు. వారి త్యాగాలను కూటమి ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు.


కాగా, ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అమరావతి పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి శరవేగంగా అడుగులు వేస్తోంది. భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేసింది. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు అమరావతిలో తమ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకోగా, మరికొన్ని సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణ పనులను కూడా ప్రారంభించాయి.

Advertisement
Gottipati Ravi Kumar
Amaravati Development
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Capital
Amaravati Education Hub
AP Skill Development University

More Telugu News