Advertisement

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ భేటీ.. 25కు పైగా కీలక అంశాలపై చర్చ

Chandrababu Naidu chairs AP cabinet meeting to discuss over 25 key issues
  • రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెల‌ప‌నున్న‌ కేబినెట్ 
  • నేతన్న భరోసా కింద ప్రతి కుటుంబానికి రూ.25,000 ఆర్థిక సాయంపై చ‌ర్చ‌
  • వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటుపై నిర్ణ‌యం
  • అగ్నిమాపక శాఖకు కొత్త వాహనాల కొనుగోలుపై కూడా చ‌ర్చించనున్న మంత్రివ‌ర్గం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. నిరుద్యోగులకు ఊరటనిస్తూ, రాష్ట్రంలో రెండో దశ కింద 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.

ఈ సమావేశంలో... చేనేత కార్మికులను ఆదుకునే లక్ష్యంతో రూపొందించిన ‘నేతన్న భరోసా’ పథకంపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాదాపు 25కు పైగా అజెండా అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు విస్తృతంగా చర్చిస్తున్నారు.

వీటితో పాటు బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనను కూడా మంత్రివర్గం పరిశీలించనుంది. శ్రీకాకుళంలో బ్రహ్మకుమారీస్ సంస్థకు కేటాయించిన స్థలం లీజు కొనసాగింపు, 15వ ఆర్థిక సంఘం నిధులతో అగ్నిమాపక శాఖకు కొత్త వాహనాలు, ఆధునిక పరికరాలు కొనుగోలు చేసే అంశాలు కూడా అజెండాలో ఉన్నాయి. సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్ తీసుకున్న ముఖ్య నిర్ణయాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది.

Advertisement
Chandrababu Naidu
AP Cabinet Meeting
Nethanna Bharosa Scheme
Andhra Pradesh Government Jobs
3168 AP Government Jobs
Andhra Pradesh Cabinet Decisions

More Telugu News