Advertisement

నీట్‌ను రద్దు చేయాల్సిందే: జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళనకు స్టాలిన్ మద్దతు

MK Stalin supports Jantar Mantar students demanding NEET cancellation
  • రాష్ట్రాల విద్యా విధానాలను గౌరవించాలన్న స్టాలిన్
  • కోట్లు పిండుకునే కోచింగ్ సెంటర్ల ఆధిపత్యానికి నీట్ రెడ్ కార్పెట్ పరిచిందని మండిపాటు
  • రాష్ట్రాల హక్కులు కాపాడబడాలంటే నీట్ రద్దు అనివార్యమని వ్యాఖ్య

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘నీట్’ పరీక్షకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన విద్యార్థుల పోరాటానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అండగా నిలిచారు. ఆందోళన బాట పట్టిన యువతకు తన పూర్తి మద్దతు ప్రకటిస్తూ 'ఎక్స్' వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును త్రిశంకు స్వర్గంలో పడేసిన నీట్‌ను పూర్తిగా రద్దు చేయడమే ఈ సమస్యకు అసలైన పరిష్కారమని స్పష్టం చేశారు. "రాష్ట్రాల విద్యా విధానాలను గౌరవించండి.. నీట్‌కు వెంటనే స్వస్తి పలకండి" అని డిమాండ్ చేశారు.


ఏ ప్రాతిపదికనైతే నీట్ పరీక్షను దేశంలోకి తీసుకొచ్చారో, ఆ ఆశయాలన్నింటినీ ఈ వ్యవస్థ పూర్తిగా నీరుగార్చిందని స్టాలిన్ ఆరోపించారు. సమాన విద్యా అవకాశాలు, పారదర్శకత, నాణ్యమైన విద్య అన్నవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న పాఠశాల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, కేవలం వేల కోట్లు పిండుకునే కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల ఆధిపత్యానికి నీట్ రెడ్ కార్పెట్ పరిచిందని మండిపడ్డారు.


విద్యార్థులు వ్యక్తం చేస్తున్న తీవ్ర ఆవేదన ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలని స్టాలిన్ వ్యాఖ్యానించారు. గ్రామీణ, పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల డాక్టర్ కలలను నీట్ తుంచేస్తోందని.. సామాజిక న్యాయం నిలబడాలన్నా, రాష్ట్రాల హక్కులు కాపాడబడాలన్నా నీట్ రద్దు అనివార్యమని తేల్చిచెప్పారు. ఇకనైనా కేంద్రం తన మొండివైఖరిని వీడాలని కోరుతూ, ‘Ban NEET, Save Students’ నినాదంతో విద్యార్థుల వైపు నిలబడి పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

Advertisement
MK Stalin
NEET Protests Delhi
Jantar Mantar Students Protest
DMK NEET Ban
NEET Exam Cancellation
Medical Entrance Exam Controversy

More Telugu News