Advertisement

ఢిల్లీ పోలీసులకు ఎన్ఎస్ఏ అధికారాలు.. సీజేపీ ఆందోళనల వేళ సర్వత్రా ఉత్కంఠ

Delhi Police granted NSA powers amid rising protests in national capital
  • ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఎన్ఎస్ఏ కింద నిర్బంధ అధికారాల పునరుద్ధరణ
  • ఇది రొటీన్ ప్రక్రియే, సీజేపీ నిరసనలకు సంబంధం లేదన్న పోలీసులు
  • పరీక్షల అవకతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు ఉద్ధృతం
  • జంతర్ మంతర్ వద్ద హింస.. నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం
  • సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
నీట్ పరీక్షల అవకతవకలపై దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులు చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఇది ప్రతి మూడు నెలలకోసారి జరిగే సాధారణ పునరుద్ధరణ ప్రక్రియేనని, దీనికి కొనసాగుతున్న నిరసనలకు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

లెఫ్టినెంట్ గవర్నర్ ఈ నెలలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 2026 జులై 19 నుంచి అక్టోబర్ 18 వరకు మూడు నెలల పాటు జాతీయ భద్రతా చట్టం-1980 కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసే అధికారాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు అప్పగించారు. ఈ నిర్ణయంపై పలు మీడియా సంస్థలు భిన్న కథనాలు ప్రచురించాయి. సీజేపీ నిరసనలను అణచివేసేందుకే ఈ అధికారాలు ఇచ్చారని వార్తలు రావడంతో ఢిల్లీ పోలీసులు నేడు ఒక ప్రకటన విడుదల చేశారు.

"కొన్ని మీడియా సంస్థలు నివేదిస్తున్నట్లుగా, సీజేపీ నిరసనలను అణిచివేసేందుకు పోలీస్ కమిషనర్‌కు ఎన్ఎస్ఏ అధికారాలు ఇచ్చారనడంలో వాస్తవం లేదు. ఇది కేవలం రొటీన్ పరిపాలనా ప్రక్రియ. జులై 19 నుంచి అక్టోబర్ 18 వరకు అధికారాల పునరుద్ధరణ కోసం జులై 7వ తేదీనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీజేపీ నిరసనలు తీవ్రరూపం దాల్చడానికి ముందే ఈ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఎలాంటి అభ్యర్థన చేయలేదు. మీడియా ఈ ఉత్తర్వులను తప్పుగా అన్వయించుకుంది" అని ఢిల్లీ పోలీసులు తమ ప్రకటనలో వివరించారు.

ఉద్రిక్తంగా మారిన సీజేపీ నిరసనలు
పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అభిజీత్ దిప్కే సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ప్రారంభించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ప్రచారం, ఇప్పుడు దేశవ్యాప్తంగా యువత నేతృత్వంలోని ఉద్యమంగా మారింది.

జూన్ 20న జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన, జూన్ 28న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్షతో మరింత ఉద్ధృతమైంది. గత వారాంతంలో ఆరోగ్యం క్షీణించగా ఆయన్ను బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించడంతో ఆందోళనలు తీవ్రమయ్యాయి.

నిన్న‌ రాత్రి జంతర్ మంతర్ సమీపంలోని సంసద్ మార్గ్ వద్ద పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వగా, వారిని చెదరగొట్టేందుకు ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్‌) బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
Advertisement
Delhi Police
National Security Act
Cockroach Janata Party
Sonam Wangchuk
Dharmendra Pradhan
Jantar Mantar Protests

More Telugu News