తాజా టారిఫ్ లతో అమెరికాకు ఎంత ఆదాయం వస్తోందంటే.. కీలక వివరాలు వెల్లడించిన ట్రంప్

Trump Reveals Massive US Revenue from Tariffs
అమెరికా నుంచి భారీ ఎత్తున సుంకాలు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం విదితమే. తమ దేశం విధించే సుంకాలకు అనుగుణంగానే ఆయా దేశాలపై తాను టారిఫ్ లు వసూలు చేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. తాజాగా ఈ టారిఫ్ లకు సంబంధించి కీలక వివరాలను ట్రంప్ వెల్లడించారు. మంగళవారం వైట్ హౌస్ లో కేబినెట్ సభ్యులు, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తాజా టారిఫ్ లతో అమెరికాకు కనీవిని ఎరుగని రీతిలో డబ్బు వచ్చిపడుతోందన్నారు.

రోజుకు 2 బిలియన్ డాలర్లు అమెరికా ఖజానాలో జమవుతున్నాయని తెలిపారు. అమెరికాకు దిగుమతయ్యే అన్ని వస్తువులపై వసూలు చేస్తున్న కనీస టారిఫ్ సొమ్ము కూడా ఇందులో ఉందన్నారు. కాగా, టారిఫ్ ల విషయంలో చర్చలకు తాను సిద్ధమని ట్రంప్ మరోమారు ప్రకటించారు. ఈ విషయంలో జపాన్, సౌత్ కొరియా దేశాలు ముందుకు వచ్చాయని చెప్పారు. ట్రంప్ జపాన్ పై 24 శాతం, సౌత్ కొరియాపై 25 శాతం ప్రతీకార సుంకాలు విధించారు.

దీనిపై చర్చించేందుకు ఆయా దేశాల ప్రతినిధులు వాషింగ్టన్ వస్తున్నారని ట్రంప్ వివరించారు. మరోవైపు, తాను విధించిన ప్రతీకార సుంకాలకు చైనా కౌంటర్ గా 34 శాతం పన్నులు విధించడంపై ట్రంప్ మండిపడ్డారు. చైనాపై అదనంగా 50 శాతం పన్ను విధించారు. చైనాపై గతంలో 20 శాతం పన్ను వసూలు చేస్తుండగా.. ట్రంప్ 34 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. తాజాగా 50 శాతం అదనపు సుంకాలతో చైనాపై అమెరికా విధించిన పన్ను మొత్తం 104 శాతానికి చేరింది. ఈ పన్నులు బుధవారం నుంచి అమలులోకి వచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Trump Tariffs Revenue
Donald Trump
US Tariffs
Trade War
China Tariffs
Japan Tariffs
South Korea Tariffs
Import Tariffs
US Economy
Trade Relations

More Telugu News