రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా 60 రకాల సరుకుల పంపిణీ.. సీఎం చంద్రబాబు కీలక సూచన

రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా 60 రకాల సరుకుల పంపిణీ.. సీఎం చంద్రబాబు కీలక సూచన

Chandrababu Naidu directs distribution of 60 types of goods through Rythu Bazars and Ration Depots
  • ధరల కట్టడితో ద్రవ్యోల్బణం నియంత్రణపై సీఎం చంద్రబాబు దృష్టి
  • మార్కెట్ జోక్యంతో నిత్యావసరాల ధరలు తగ్గించాలని అధికారులకు ఆదేశం
  • హైరిస్క్ ఉద్యాన పంటల పరిరక్షణకు రూ.190 కోట్లు కేటాయింపు
  • సాగులో లేని భూముల్లో వర్షాధార పంటలు వేయించాలని నిర్ణయం
నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారం కాకుండా చూడాలని, ధరలకు కళ్లెం వేయడం ద్వారానే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించగలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పంటల ఉత్పత్తి, సరఫరా, మార్కెట్ నిర్వహణపై ముందస్తు అంచనాలతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణాలను విశ్లేషించాలని, ఉత్పత్తికి, డిమాండ్‌కు మధ్య వ్యత్యాసం, సరఫరాలో లోపాలు వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మార్కెట్ జోక్యంతో ధరల కట్టడి
ధరల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్ (ప్రభుత్వ జోక్యం) చాలా అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏయే పంటలకు, ఏయే ప్రాంతాల్లో మార్కెట్ జోక్యం అవసరమో గుర్తించి, ధరలు పెరగకుండా చూడాలన్నారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలను రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయడంతో పాటు, ఆయా పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. అవసరమైతే రైతుల నుంచి నేరుగా పంటను కొనుగోలు చేసేందుకు బై-బ్యాక్ ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. "ముందుగా అంచనా (ప్రెడిక్షన్) వేశాకే ఉత్పత్తికి (ప్రొడక్షన్‌) వెళ్లాలి. ఆ మేరకు మార్కెట్‌ను కూడా అంచనా వేసుకోవాలి" అని సీఎం స్పష్టం చేశారు. ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, రైతు బజార్లు, రేషన్ డిపోల వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ధరలను అదుపులో ఉంచాలన్నారు.

రైతు బజార్లు, రేషన్ల ద్వారా పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా దాదాపు 60 రకాల నిత్యావసర సరుకులను ప్రజలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. తక్షణమే ఉల్లి, కందిపప్పు వంటివి అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పామాయిల్‌ను కూడా రేషన్ డిపోల ద్వారా సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. పశుగ్రాసం కొరత వల్ల పాల ఉత్పత్తి తగ్గిందనే మాట ఎక్కడా వినిపించకూడదని, పశుదాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

ప్రణాళికాబద్ధమైన పంటల సాగు
రాష్ట్రంలో సాగు చేయకుండా ఉన్న 8.61 లక్షల హెక్టార్ల భూమిలో వర్షాధార పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా చిరుధాన్యాలైన రాగి, కొర్రలు, జొన్న, సజ్జలతో పాటు మొక్కజొన్న, ఉలవల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని (నేచురల్ ఫార్మింగ్) ప్రోత్సహించాలని సూచించారు. సంప్రదాయ ప్రాంతాల్లోనే కాకుండా, కొత్త ప్రాంతాల్లో కూడా ఉల్లి, మిర్చి వంటి పంటలు పండించేలా చూడాలన్నారు. రైతు సేవా కేంద్రాల వారీగా పంటల వివరాలు సేకరించి, డిమాండ్‌కు అనుగుణంగా సాగు ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ఉద్యాన పంటల రక్షణకు రూ.190 కోట్లు
రాష్ట్రంలో 3.61 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు అధిక వర్షాభావ పరిస్థితుల (హైరిస్క్) కారణంగా ప్రమాదంలో ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి, ఈ పంటలను కాపాడేందుకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కోసం రూ.190 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడం వంటి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతినెలా కేంద్రానికి నివేదిక పంపాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ సీఏ గ్లోబల్ అవార్డు-2026 రావడంపై అధికారులను చంద్రబాబు అభినందించారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Government
Rythu Bazars
Ration Depots
Essential Commodities
Agriculture Price Control

More Telugu News