చేతిలో సుత్తితో ఐపీఎల్ వేలం నిర్వహించనున్న అమ్మడు.. అసలు ఎవరీ మల్లికా సాగర్?
- ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వహించనున్న మహిళా ఆక్షనీర్ మల్లికా సాగర్
- వేలం నిర్వహణలో అపార అనుభవం సంపాదించిన ముంబై వాసి
- ఆధునిక భారతీయ కళాఖండాలపై నైపుణ్యం ఉన్న కన్సల్టెంట్‌గా గుర్తింపు
మల్లికా సాగర్ ముంబైకి చెందినవారు. ఆమె ఒక ఆర్ట్ కలెక్టర్. అంటే కళాఖండాలను సేకరిస్తుంటారు. ఆధునిక భారతీయ శిల్పకళలపై నైపుణ్యం ఉన్న కన్సల్టెంట్‌గా ఆమె విశిష్ట గుర్తింపు పొందారు. ముంబైకి చెందిన ఆక్షన్ కంపెనీ ‘పుండోల్స్’కు సంబంధించిన వేలం పాటలను నిర్వహించడం ద్వారా ఆమె అపారమైన అనుభవాన్ని పొందారు. క్రీడారంగానికి సంబంధించిన వేలంపాటలు నిర్వహించడం మల్లికకు కొత్తేమీ కాదు. గతంలో పలు వేలాలను ఆమె విజయవంతంగా నిర్వహించారు.
ఐపీఎల్ 2024 మినీ-వేలంలో హ్యూ ఎడ్మీడ్స్ స్థానంలో మల్లికా బాధ్యతలు చేపట్టారు. ఐపీఎల్‌లో తొలి మహిళా ఆక్షనీర్‌గా ఆమె నిలిచారు. గతంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం కూడా నిర్వహించారు. క్రికెట్‌కు సంబంధించిన వేలాలే కాదు ప్రో-కబడ్డీ లీగ్ వేలంపాటలు నిర్వహించిన అనుభవం కూడా ఆమెకు ఉంది. ప్రోకబడ్డీ లీగ్ సీజన్-8 వేలం నిర్వహణ బాధ్యతలను ఆమే చూసుకున్నారు.
కాగా ఐపీఎల్ వేలంలో ఎవరెవరు ఎంత ధరకు అమ్ముడుపోతారు? రికార్డులు ఏమైనా బద్దలవుతాయా? అనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఐపీఎల్ వేలం తొలిసారి భారత్ వెలుపల జరగబోతోంది.