మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 4కి వాయిదా.. కారణం ఇదే
- డిసెంబర్ 3న ప్రత్యేక ప్రాముఖ్యత దృష్ట్యా తేదీని సవరించిన ఎన్నికల సంఘం
- క్రైస్తవులు ఎక్కువగా ఉండే మిజోరాంలో ఈ ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు
- కౌంటింగ్ వాయిదా వేయాలంటూ వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ
ఎన్నికల సంఘం నిర్ణయానికి ముందు ఎన్నికల కౌంటింగ్ తేదీని వాయిదా వేయాలంటూ మిజోరాం ఎన్‌జీవో సమన్వయ కమిటీ సభ్యులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కాగా ఈ కమిటీ చాలా ప్రభావవంతమైనది. సెంట్రల్ యంగ్ మిజో అసోసియేషన్, మిజో జిర్లై పాల్‌తోపాటు కీలకమైన పౌర సమాజ సంస్థలు, విద్యార్థి సంఘాలకు ప్రధాన సంస్థగా వ్యవహరిస్తోంది.
కాగా గురువారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మిజోరాంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశాయి. మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎంఎన్ఎఫ్ 14-18 సీట్లు, జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం) 12-16 స్థానాలు, కాంగ్రెస్ 8-10 సీట్లు, బీజేపీ 0–2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ విశ్లేషించింది. కాగా మిజోరం శాసన సభకు నవంబర్ 7న పోలింగ్ జరిగింది. 8.57 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 174 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సవరించిన కౌంటింగ్ తేదీ ప్రకారం వారందరి భవితవ్యం డిసెంబర్ 4న తేలనుంది.