ఉత్తరాఖండ్ ప్రమాదం: రిషిగంగలో కొత్త సరస్సు.. ధ్రువీకరించిన ఉపగ్రహ చిత్రాలు

Uttarakhand Satellite images confirm new lake near Rishiganga growing
  • ప్రమాదం తర్వాత 350 మీటర్ల పొడవున సహజంగా ఏర్పడిన సరస్సు
  • 10 డిగ్రీల వాలుతో 60 మీటర్ల లోతు.. 70 కోట్ల లీటర్ల నీళ్లు
  • ఆ ప్రాంతాన్ని పరిశీలించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలు.. సీడబ్ల్యూసీకి నివేదిక సమర్పణ
  • భవిష్యత్ లో వరద ముప్పు ఉంటుందన్న ఆందోళన
  • 9 నిమిషాల్లోనే 2.5 కిలోమీటర్ల వరకు వరద వెళ్తుందని అంచనా
గత ఆదివారం మంచు కొండలు విరిగి పడి.. ధౌలిగంగా నది పొంగింది. విద్యుత్ ప్రాజెక్టులను ముంచేసింది. వందలాది మంది అందులో గల్లంతయ్యారు. ఇప్పటికీ సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఇంకో కొత్త ముప్పు ముంచుకొస్తోంది. మంచు చరియలు విరిగిపడిన చోట ఓ కొత్త సరస్సు పుట్టుకొచ్చింది. రోజురోజుకు అది విస్తరిస్తోంది. రిషిగంగ వద్ద సముద్ర మట్టానికి 2,838 మీటర్ల ఎత్తున ఆ సరస్సు ఏర్పడినట్టు అధికారులు, శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు.

జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)ల ఉపగ్రహ చిత్రాల ద్వారా అది ప్రమాదం తర్వాత కొత్తగా ఏర్పడిన సరస్సే అని తేలింది. డీఆర్డీవో శాస్త్రవేత్తలు ఆ సరస్సు ఏర్పడిన ప్రాంతాన్నీ పరిశీలించి వచ్చారు. ఇప్పటిదాకా అక్కడ 7 లక్షల ఘనపు మీటర్ల మేర (70 కోట్ల లీటర్లు) నీరు వచ్చి చేరినట్టు చెబుతున్నారు. 350 మీటర్ల పొడవున్న ఈ సరస్సు.. మూడు ఫుట్ బాల్ మైదానాల పరిమాణంలో ఉన్నట్టు చెబుతున్నారు. సహజంగా ఏర్పడిన ఈ డ్యామ్ లోతు దాదాపు 60 మీటర్లుందని చెప్పారు.

ప్రస్తుతం దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినా... మున్ముందు మాత్రం మరిన్ని వరదలు వచ్చే ముప్పుందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి అక్కడ సరస్సు ఏర్పడినట్టు గురువారమే హేమవతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ వీడియోను విడుదల చేశారు. అక్కడ నీరు చేరిన విషయం నిజమే అయినా.. అది కొత్తగా ఏర్పడిన సరస్సు అని ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ వర్సిటీ.

ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఉపగ్రహ చిత్రాలు.. ఆ సరస్సు ఇప్పుడు ఏర్పడిందేనని తేల్చింది. డీఆర్డీవో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా సీడబ్ల్యూసీ అక్కడ వరదల పరిస్థితిపై అంచనా వేస్తోంది. వరద వస్తే ఎంత సేపట్లో వస్తుంది? జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎంత సమయం పడుతుంది? వంటి వివరాలతో లెక్కలు వేస్తోంది.

దాని ఆధారంగా సెకనుకు 8.9 లక్షల లీటర్ల నీళ్లు సరస్సు నుంచి వచ్చే అవకాశం ఉందని, అలా అయితే రెండున్నర కిలోమీటర్ల దూరాన్ని 9 నిమిషాల్లోనే నీళ్లు చేరతాయని అంచనా వేసింది. జోషిమఠ్ కు రావడానికి 53 నిమిషాలు పడుతుందని లెక్కగట్టింది. కాగా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు.

అక్కడ మంచు పేరుకుపోయి.. అది కరగడం వల్లే సరస్సు ఏర్పడి ఉండొచ్చన్నారు. అయినా, ప్రతిక్షణం అప్రమత్తంగానే ఉన్నామన్నారు. ఇప్పటికే వైమానిక దళంతో మాట్లాడామన్నారు. గంటకోసారి ఉపగ్రహ చిత్రాలను తీసి వాటిని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లేబొరేటరీకి పంపిస్తున్నామని చెప్పారు.
Go Back to Shorts
Uttarakhand
Rishi Ganga
Dhauli Ganga

More Telugu News