Narendra Modi: మనకు అత్యుత్తమ మేధావులు ఉన్నారు, అతిపెద్ద మార్కెట్లు మనవే: ప్రధాని మోదీ

PM Modi inaugurates Bengaluru Tech Summit
షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు టెక్ సమ్మిట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతున్న ఈ శాస్త్రసాంకేతిక విజ్ఞాన సదస్సులో ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్ ఇండియా గురించి మాట్లాడారు.

డిజిటల్ ఇండియా కార్యాచరణను ఐదేళ్ల కిందట తీసుకువచ్చామని, ఇకపై దీన్ని సాధారణ ప్రభుత్వ పథకంలా భావించలేమని, పేద, బడుగు బలహీన వర్గాల వారికి అదొక జీవన పంథా అవుతుందని అన్నారు. మానవ ఆధారిత అభివృద్ధికి ఇది సాక్షీభూతంలా మారిందని, అందుకు డిజిటల్ ఇండియాకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని అభిప్రాయపడ్డారు. సాంకేతికత ద్వారా జనజీవన సౌందర్యం మరింత విస్తృతమైందని తెలిపారు. కోట్లాది మంది రైతులు ఒక్క క్లిక్ తో ద్రవ్యపరమైన మద్దతు పొందగలుగుతున్నారని వివరించారు.

25 ఏళ్ల కిందట భారత్ లో ఇంటర్నెట్ ప్రవేశించిందని, ఇటీవలే దేశంలోని ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య 750 మిలియన్లు దాటిందని, అయితే ఇందులో సగం కనెక్షన్లు గత నాలుగేళ్లలో నమోదైనవేనని వివరించారు. ఈ వార్తా ప్రపంచంలో సమాచారమే ముడిసరుకు అని, ఇప్పుడిది అందరికీ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. సమాచార శకంలో భారత్ తన విభిన్న పంథాతో అందరికంటే ముందు నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మనకు అత్యుత్తమ మేధావులు ఉన్నారని, అతిపెద్ద మార్కెట్లు మనవేనని ఉద్ఘాటించారు. మన యువత శక్తిసామర్థ్యాలు, శాస్త్రసాంకేతిక అవకాశాలు అపారం అని, ఈ దిశగా పాటవ ప్రదర్శనకు, పరపతి పెంపుకు ఇదే తగిన సమయం అని అన్నారు. మన ఐటీ రంగం దేశాన్ని గర్వించేలా చేస్తుందని తనకు గట్టి నమ్మకం ఉందని తెలిపారు. టెక్, ఆవిష్కరణల రంగాన్ని మరింత స్వేచ్ఛాయుతం చేసే దిశగా తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఇటీవలే ఐటీ రంగంపై అనుమతుల భారాన్ని కూడా తగ్గించామని మోదీ చెప్పారు.
Go Back to Shorts
Narendra Modi
Bengaluru Tech Summit
Digital India
Technology
India

More Telugu News