జైలులో ఉన్న టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సౌకత్ మొల్లా చుట్టూ బిగుస్తున్న ‘లైంగిక’ ఉచ్చు!
- టీఎంసీ మాజీ ఎమ్మెల్యే షౌకత్ మొల్లా కొత్తగా లైంగిక దాడి ఆరోపణలు
- కొడుకును కిడ్నాప్ చేసి ఏడాది పాటు తనపై అత్యాచారం చేశారని మహిళ ఆరోపణ
- తనను వివస్త్రను చేసి హింసించారని మరో మహిళ ఫిర్యాదు
- గతంలో ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారని బాధితుల వాదన
- బాంబు పేలుడు కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న షౌకత్
2019లో షౌకత్ మొల్లా తన కొడుకును కిడ్నాప్ చేసి, ఏడాది పాటు నిర్బంధంలో ఉంచారని బాధిత మహిళ ఆరోపించారు. బిడ్డను అడ్డం పెట్టుకుని తనను లొంగదీసుకున్నాడని, ఏడాది పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని కన్నీటిపర్యంతమయ్యారు. "నా కొడుకు కోసం నేను వెళ్లాను. అతను ఎప్పుడు పిలిస్తే అప్పుడు కారు పంపేవాడు. నేను వెళ్లాల్సిందే. ఏడాది పాటు ఈ నరకం అనుభవించాను. అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారు" అని బాధితురాలు కోల్‌కతా కోర్టు బయట తెలిపారు.
మరో బాధితురాలు, స్థానిక బీజేపీ కార్యకర్త, తనపై జరిగిన దాడిని వివరించారు. "2015 నవంబర్ 7న నన్ను వివస్త్రను చేసి అత్యంత దారుణంగా హింసించారు. నేను బీజేపీ స్థానిక కార్యదర్శిగా ఉండటం, ఓ చిన్న స్కూల్ నడుపుతూ ఆడపిల్లల గౌరవాన్ని కాపాడటమే నేను చేసిన నేరం" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
షౌకత్ మొల్లా ప్రస్తుతం జైల్లో ఉన్నందునే బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని వారి తరఫు న్యాయవాది తెలిపారు. "ఆ రోజుల్లో షౌకత్ అకృత్యాలను భరించక తప్పలేదు. ఏ రోజు ఏ మహిళ కావాలో ఒక లిస్ట్ మెయింటైన్ చేసేవారు. వారికి కారు పంపి బలవంతంగా తీసుకెళ్లేవారు" అని న్యాయవాది వివరించారు. షౌకత్ అనుచరులు ఇప్పటికీ బయట ఉన్నారని, తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.