శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం: ప్రధాని మోదీ
- 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించిందని వెల్లడి
- పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తిన సంక్షోభాన్ని వ్యూహాత్మకంగా ఎదుర్కొన్నామని స్పష్టం
- చమురు రంగ కంపెనీలు రూ. 75,000 కోట్లకు పైగా నష్టాలను భరించాయని వెల్లడి
- ఇంధనం అందించే దేశాల సంఖ్యను 40కి పెంచుకున్నామన్న మోదీ
"నవ భారత సంకల్పం, కృషితో 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని మనం అధిగమించాం" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో ఇంధన సరఫరాకు తీవ్ర విఘాతం ఏర్పడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి, జాతీయ వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు, దౌత్య సంబంధాల ద్వారా చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
ఇంధన సంక్షోభం తలెత్తిన సమయంలో వినియోగదారులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రూ. 75,000 కోట్లకు పైగా నష్టాలను భరించాయని, ప్రభుత్వం వారికి పూర్తి అండగా నిలిచిందని ప్రధాని వివరించారు. దౌత్యపరమైన చొరవతో, మనకు ఇంధనం అందించే దేశాల సంఖ్యను 25 నుంచి 40కి పెంచుకున్నామని, దీనివల్ల దేశంలో ఎక్కడా కొరత ఏర్పడకుండా చూడగలిగామని తెలిపారు. కొందరు ప్రతిపక్ష నేతలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రభుత్వం తెరవెనుక చేసిన కృషి చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. ఈ విజయం 'ఆత్మనిర్భర్ భారత్' స్ఫూర్తికి నిదర్శనమని ఆయన కొనియాడారు.