అసత్యాలతో మోసగించి, వెనుక దారిలో టీవీ9 సంస్థలోకి చొరబడ్డారు: రవిప్రకాశ్ బహిరంగ లేఖ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసత్యాలతో మోసగించి, వెనుక దారిలో టీవీ9 సంస్థలోకి చొరబడ్డారు: రవిప్రకాశ్ బహిరంగ లేఖ

  • జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు
  • అక్రమ మార్గం ద్వారా డైరెక్టర్లను చొప్పించారు
  • నాతో పనిచేసే వారిని వేధిస్తున్నారు
టీవీ9 సీఈవోగా తనను తొలగించడంపై రవిప్రకాశ్ స్పందించారు. తనను పదవి నుంచి తప్పించి, తప్పుడు కేసులు బనాయించి, యాజమాన్యాన్ని వేధించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ రాశారు. అసత్యాలతో మోసగించి, దొడ్డి దారిన టీవీ9 సంస్థలోకి చొరబడ్డారని ఆరోపించారు. పోలీసులను యథేచ్చగా వినియోగించి తనపై అర్థం పర్థం లేని కేసులు వేసి చేతుల్లోని మీడియా సహాయంతో అసత్య ప్రచారం చేశారని రవిప్రకాశ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లేఖ సారాంశం యథాతథంగా..

‘‘విషయం: టీవీ9 గ్రూప్ ఛానల్స్ సీఈవో పదవి నుంచి రాజీనామా, తప్పుడు కేసులు బనాయించడం, యాజమాన్యాన్ని వేధించడంపై నిరసన...
 
వెనుకదారిలో అక్రమంగా ప్రవేశించిన బోర్డు సభ్యులకు..
 
నేను.. రవిప్రకాష్.. టీవీ9 వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాజీనామా చేసే ముందు ఈ అంశాల్ని మీ ముందు ఉంచుతున్నాను. మీరు రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. స్వతంత్రంగా పనిచేసే టీవీ9 పని పట్టాలని ఈ చర్యలకు దిగారు. అసత్యాలతో మోసగించి, వెనుక దారిలో టీవీ9 సంస్థలోకి జొరబడ్డారు. ఎన్‌సిఎల్‌టి కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తూ సంస్థలో మార్పులు ప్రారంభించారు. ఓ ప్రొఫెషనల్ కంపెనీ సెక్రటరీని బెదిరించి ఏబీసీఎల్ అసలు డైరెక్టర్ల మీద తప్పుడు కేసులు పెట్టారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో అక్రమ మార్గం ద్వారా నలుగురు డైరెక్టర్లను చొప్పించి పోలీసుల సహాయంతో టీవీ9ని కంట్రోల్‌లోకి తీసుకున్నారు.

తప్పుడు కంప్లయింట్స్‌తో, తప్పుడు కేసులతో నన్ను వేధించే ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో చేశారు. పోలీసులను యథేచ్చగా వినియోగించి నా మీద అర్థం పర్థం లేని కేసులు వేసి మీ చేతుల్లోని మీడియాలో అసత్య ప్రచారం చేశారు. నాతో పనిచేసే వారిని వేధించి, పోలీసుల దాడులకు గురి చేసి భయోత్పాతానికి గురి చేసి బలవంతంగా కంపెనీ స్వాధీనం చేసుకున్నారు.

మీరెన్ని అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా నేను మీ సాటి షేర్ హోల్డర్‌గా, సంస్థలో నా వాటాకు ప్రతినిధిగా మీ పక్కనే ఉంటాను. దేశంలో జర్నలిజాన్ని కాపాడటానికి, పాత్రికేయ విలువల్ని రక్షించడానికి మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నిలువరించటానికి నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది" అని రవిప్రకాష్ పేర్కొన్నారు.
Ravi Prakash
TV9
CEO
Police
Journalism
Media

More Telugu News