తుపాను పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఏపీ మంత్రులు
- పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం
- పది వేల విద్యుత్ స్తంభాలను సిద్ధంగా ఉంచాం
- ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు: నారాయణ
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాం: తూ.గో. కలెక్టర్
తూర్పుగోదావరి జిల్లాలో 28 వేల మందికి భోజనం, సదుపాయాలు కల్పిస్తున్నామని ఆ జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలో వృద్ధులు, పిల్లలకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలోని 98 గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేదని, కాకినాడలో విద్యుత్ సరఫరా పునురుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టామని, ఈరోజు రాత్రిలోగా 80 గ్రామాలకు విద్యుత్ సరఫరా అందేలా చూస్తామని అన్నారు. రేపు సాయంత్రం లోగా జిల్లా అంతటా విద్యుత్ సరఫరా ఉండేలా చూస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిన సమాచారం అందుతోందని, ఆర్టీసీ బస్సు సేవలు మళ్లీ పునరుద్ధరిస్తామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని రహదారులపై ఎక్కడా అడ్డంకులు లేవని, నిన్న మధ్యాహ్నం నుంచి రంగంలోకి దిగిన 47 బృందాలు వాటిని తొలగించాయని తెలిపారు. అనుకున్న దాని కంటే తుపాను ప్రభావం తక్కువగా ఉందని, పంటనష్టంపై ఈరోజు సాయంత్రం ఏడు గంటల వరకు ప్రాథమిక సమాచారం అందుతుందని పేర్కొన్నారు.