జూనియర్ ఆర్టిస్టుపై సామూహిక అత్యాచారం.. నిందితుడికి సహకరించిన బాధితురాలి స్నేహితురాళ్లు!
- డబ్బుల విషయంలో గొడవ
- గుంటూరు తీసుకెళ్లి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం
- సహకరించిన బాధితురాలి స్నేహితులు
గుంటూరు జిల్లాకు చెందిన శిరీష, హేమలత లంగర్‌హౌస్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. ఎల్లారెడ్డిగూడలోని ఓ హాస్టల్‌లో వీరి స్నేహితురాలైన మరో జూనియర్ ఆర్టిస్ట్ ఉంటోంది. ఇటీవల ఈ యువతికి రాజ్‌కిరణ్ అనే యువకుడితో పరిచయం అయింది. ఇద్దరి మధ్య స్నేహం ముదరడంతో అతడు కూడా ఆమెకు సమీపంలోనే ఓ హాస్టల్‌కు మారాడు.
ఈ క్రమంలో సినిమాల్లో అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న జూనియర్ ఆర్టిస్టుల కోసం ఇద్దరూ కలిసి ‘మన’ అనే సంస్థను ఏర్పాటు చేసి అటువంటి వారి వివరాలు సేకరించారు. వారందరి నుంచి సభ్యత్వం కోసం కొంత మొత్తం వసూలు చేశారు. అయితే, ఈ డబ్బుల పంపకం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో కక్షపెంచుకున్న రాజ్‌కిరణ్ మార్చి 5న శిరీష, హేమలతతోపాటు యువతిని కూడా గుంటూరు తీసుకెళ్లి ఓ లాడ్జ్‌లో రూము తీసుకుని అందులో పెట్టాడు.
అనంతరం హేమ, శిరీషలు బాధిత యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇవ్వగా, దానిని తాగిన ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో రాజ్‌కిరణ్ తన మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా తీసిన వీడియోను చూపించి పలుమార్లు యువతిని బెదిరించాడు. అతడి వేధింపులు రోజురోజుకు పెరగడంతో యువతి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.