నకిలీ పోలీసులతో ర్యాలీలా?: వైసీపీపై హోంమంత్రి అనిత నిప్పులు
- పోలీసు వ్యవస్థను వైసీపీ నేతలు అవమానిస్తున్నారన్న అనిత
- క్రిమినల్ రాజకీయాలు చేసేవారికి రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని వ్యాఖ్య
- వ్యవస్థలను దిగజార్చాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక
నకిలీ పోలీసులతో ర్యాలీలు నిర్వహిస్తూ వైసీపీ నాయకులు రాష్ట్ర పోలీసు వ్యవస్థను తీవ్రంగా అవమానిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ నేతలు ఇలాంటి దిగజారుడు చర్యలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు నకిలీ పోలీసుల ముసుగులో ర్యాలీలు చేస్తూ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించిన ఆమె, ముసుగులు వేసుకుని క్రిమినల్ రాజకీయాలు చేసేవారికి రాజకీయాల్లో కొనసాగే అర్హతే లేదని తేల్చి చెప్పారు.
పోలీసు వ్యవస్థ గౌరవాన్ని, విశ్వసనీయతను దెబ్బతీసే ఏ ఒక్క చర్యను కూడా కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని హోంమంత్రి స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వ వ్యవస్థలను దిగజార్చాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనలో ర్యాలీలో పాల్గొన్న నకిలీ పోలీసులతో పాటు, వారి వెనకుండి నడిపించిన అసలు వైసీపీ సూత్రధారులపైనా చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు.