ఎయిరిండియా కుదుపుల ఘటన.. రెండోసారీ పైలట్‌కు డ్రగ్‌ పాజిటివ్‌!

Air India turbulence incident Pilot tests positive for drugs for the second time
  • పైలట్‌ గంజాయి సేవించినట్లు పరీక్షలో నిర్ధారణ అయినట్లు సమాచారం
  • 300 అడుగులు కిందకు పడిన ఫుకెట్‌-ఢిల్లీ విమానం
  • 13 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందికి గాయాలు
  • ఘటన సమయంలో పైలట్‌ సీటులో లేరని సమాచారం
  • కో-పైలట్‌ విమానాన్ని నియంత్రిస్తున్నట్లు సమాచారం
ఫుకెట్‌ నుంచి ఢిల్లీ వెళ్తూ ఒక్కసారిగా 300 అడుగుల మేర కిందకు పడిపోయిన ఎయిరిండియా విమాన పైలట్‌కు నిర్వహించిన రెండో డ్రగ్‌ పరీక్షలోనూ పాజిటివ్‌గా తేలినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పైలట్‌ గంజాయి సేవించినట్లు పరీక్షలో నిర్ధారణ అయినట్లు సమాచారం. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు.

137 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బందితో ఎయిరిండియా విమానం ఏఐ-2379 ఫుకెట్‌ నుంచి ఢిల్లీ బయలుదేరింది. ప్రయాణ సమయంలో తీవ్ర కుదుపులు ఎదురయ్యాయి. క్రూజ్‌ దశలో విమానం అకస్మాత్తుగా 300 అడుగుల మేర కిందకు పడిపోయింది. దీంతో విమానంలో ఉన్న పలువురు గాయపడ్డారు. నలుగురు సిబ్బందిలో ఇద్దరికి వెన్నెముక కింది భాగం, మెడ వద్ద గాయాలైనట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.

ఢిల్లీ చేరుకున్న తర్వాత నిర్వహించిన డ్రగ్‌ పరీక్షలో పైలట్‌ మానసికంగా ప్రభావం చూపే పదార్థాలు తీసుకున్నట్లు తేలిందని తొలుత సమాచారం వెలువడింది. అనంతరం మరోసారి పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలోనూ ఫలితం పాజిటివ్‌గా వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పైలట్‌ గంజాయి సేవించినట్లు రెండో పరీక్షలో నిర్ధారణ అయినట్లు పేర్కొన్నాయి.

విమానం 300 అడుగుల మేర కిందకు పడిన సమయంలో పైలట్‌ తన సీటులో లేరని సమాచారం. కో-పైలట్‌ ఎయిర్‌బస్‌ ఏ320నియో నియంత్రణలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విమానం ఒక్కసారిగా కిందకు పడటానికి పైలట్‌ చర్య, సాంకేతిక లోపం లేదా హైడ్రాలిక్‌ సమస్య కారణమైందా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఈ ఘటనలో విమానం ‘నెగెటివ్‌-జీ’ పరిస్థితిలోకి వెళ్లినట్లు సమాచారం. దీంతో సీటు బెల్ట్‌ పెట్టుకోని ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా పైకి ఎగిరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వెనుక భాగంలో సీటు బెల్ట్‌ ధరించని కొందరికి తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నాయి.
Advertisement
Air India Pilot
Phuket Delhi Flight
Drug Test Positive
AI 2379 Turbulence
Marijuana
Aviation Safety

More Telugu News