భారత్‌లో అరుణాచల్‌ అంతర్భాగం.. మార్చడం ఎవరితరం కాదు: కేంద్రం

Arunachal Pradesh is an integral part of India and no one can change this reality says Centre
  • ఈ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరన్న విదేశాంగ శాఖ
  • 27 ప్రాంతాలకు భారత పేర్లపై చైనా అభ్యంతరం
  • సరిహద్దులో శాంతి అత్యంత కీలకమన్న భారత్‌
  • ఆగస్టు 6న ఎల్‌ఏసీ పరిస్థితిపై చర్చలు
  • దౌత్య, సైనిక మార్గాలు కొనసాగించేందుకు అంగీకారం
అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని విదేశాంగ శాఖ మరోసారి స్పష్టం చేసింది. అది ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని పేర్కొంది. ఈ వాస్తవాన్ని మార్చడం ఎవరితరం కాదని తేల్చిచెప్పింది. అరుణాచల్‌లో 27 ప్రాంతాలకు భారత పేర్లను అధికారికంగా గుర్తించడంపై చైనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత్‌ ఈ మేరకు స్పందించింది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో విడదీయలేని, అంతర్భాగమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదన్నారు. భారత నిర్ణయాన్ని ‘చెల్లదు’ అంటూ చైనా చేసిన ప్రకటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఈ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు.

భారత్‌-చైనా సంబంధాల్లో సరిహద్దు అంశాలు అత్యంత కీలకమైనవని జైస్వాల్‌ తెలిపారు. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత కొనసాగడం రెండు దేశాల విస్తృత సంబంధాలకు ఎంతో ముఖ్యమన్నారు. సరిహద్దు పరిస్థితులు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు.

ఆగస్టు 6న జరిగిన భారత్‌-చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు, సమన్వయ యంత్రాంగం 36వ సమావేశంలో వాస్తవాధీన రేఖ వెంట పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత కొనసాగించాల్సిన అవసరాన్ని భారత్‌ మరోసారి నొక్కి చెప్పిందన్నారు.

పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఉన్న దౌత్య, సైనిక మార్గాలను కొనసాగించాలని రెండు దేశాలు అంగీకరించినట్లు జైస్వాల్‌ తెలిపారు. డబ్ల్యూఎంసీసీ సమావేశాలు, స్థానిక కమాండర్‌ స్థాయి చర్చలు సహా ఇతర అంగీకరించిన మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
Advertisement
Arunachal Pradesh
Randhir Jaiswal
India China Border Dispute
Ministry of External Affairs
LAC Peace and Tranquility
India China Bilateral Relations

More Telugu News