ఇరాన్ అణు కార్యక్రమంపై కీలక సమాచారం అందించిన వారికి 20 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 166 కోట్లు) వరకు భారీ రివార్డును అమెరికా ప్రకటించింది. శుక్రవారం యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ సంచలన ప్రకటన విడుదల చేసింది. సమాచారం అందించిన వారికి అవసరమైతే పునరావాసం కూడా కల్పిస్తామని స్పష్టం చేసింది.

అమెరికా విదేశాంగ శాఖకు చెందిన 'రివార్డ్స్ ఫర్ జస్టిస్' కార్యక్రమం కింద ఈ ఆఫర్‌ను ప్రకటించారు. ఇరాన్ అణు కేంద్రాలు, వాటిలో ఉపయోగించే పరికరాలు, ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది వివరాలు అందించాలని కోరారు. సిగ్నల్ లేదా టోర్ ఆధారిత చానెల్ ద్వారా ఈ సమాచారాన్ని రహస్యంగా పంపవచ్చని సూచించారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) నిబంధనలను ఇరాన్ ఉల్లంఘిస్తోందని, దీనివల్ల సెంట్రిఫ్యూజ్‌ల వంటి కీలక పరికరాల ఉత్పత్తి, నిల్వలపై పర్యవేక్షణ లేకుండా పోయిందని అమెరికా విదేశాంగ శాఖ ఆరోపించింది.

మరోవైపు, ఈ ప్రకటనకు ముందు ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "మనం ఇరాన్‌పై దాడి చేయకపోయి ఉంటే, ఈ రోజు ఇజ్రాయెల్ ఉండేది కాదు. వారికి అణ్వాయుధాలు చిక్కి ఉంటే తప్పకుండా వాడేవారు" అని ఆయన అన్నారు. గత ఎనిమిది నెలల ఘర్షణతో ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా తీవ్రంగా దెబ్బతిన్నదని, ఇప్పుడు ఒప్పందం కోసం ఆరాటపడుతోందని ట్రంప్ పేర్కొన్నారు. మధ్య ఇరాన్‌లోని ‘పికాక్స్ మౌంటెన్’ వంటి ఒకటి రెండు ప్రాంతాలపై ఇంకా దృష్టి సారించాల్సి ఉందని ఆయన తెలిపారు.

అయితే, ట్రంప్ ఆరోపణలను ఇరాన్ అధికారులు ఖండించారు. ‘పికాక్స్ మౌంటెన్’కు అణు కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి టెహ్రాన్ సిద్ధంగా ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్ ఇటీవలే స్పష్టం చేయడం గమనార్హం.