ఏపీలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా గుడిపాల జడ్పీటీసీ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మమతశ్రీ తన ఆస్తుల విలువను రూ. 172.27 కోట్లుగా చూపడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె ఈ వివరాలను పొందుపరిచారు.

అఫిడవిట్ ప్రకారం.. మమతశ్రీ కుటుంబానికి రూ. 9.28 కోట్ల చరాస్తులు, రూ. 162.99 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె పేరిట రెండు స్కూటర్లు, 1.10 కిలోల బంగారం, 15 కిలోల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమె భర్త మోగిలీశ్వర నాయుడు (ఈశ్వర నాయుడు) పేరిట మూడు గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, మూడు కాంక్రీట్ మిక్సర్ ట్రక్కులు ఉన్నాయి.

స్థిరాస్తుల విషయానికొస్తే, మమతశ్రీ పేరిట రూ. 43.64 కోట్లు, ఆమె భర్త పేరిట రూ. 119.80 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో 44.62 ఎకరాల వ్యవసాయ భూమి, రూ. 24.89 కోట్ల విలువైన ఇళ్లు ఉన్నాయి. ఈ ఇళ్లు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంతో పాటు కర్ణాటకలో ఉన్నట్లు తెలిపారు. 

ఇదే సమయంలో తమకు రూ. 32 కోట్ల మేర అప్పులు కూడా ఉన్నాయని దంపతులు అఫిడవిట్‌లో వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి ఇంత భారీ మొత్తంలో ఆస్తులు ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.