కేరళకు చెందిన ఓ వృద్ధురాలు చిన్నారులకు వినూత్న పద్ధతిలో అక్షరాలు నేర్పుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇసుకను పలకగా, కర్రను బలపంగా మార్చి ఆమె చెబుతున్న పాఠాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. స్థానికంగా 'ఆశాట్టి అమ్ముమ్మ'గా పిలుచుకునే ఈ బామ్మ, తన చుట్టూ చిన్నారులను కూర్చోబెట్టుకుని వారికి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. 'మామ్ ఆఫ్ సఫాచి' అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో, ఆమె ముందుగా బకెట్‌లోని ఇసుకను నేలపై పోసి, ఒక కర్రతో దాన్ని సమానంగా చదును చేసి పలకలా తయారుచేశారు. 

ఆ తర్వాత అదే కర్రతో దానిపై అక్షరాలు రాసి పిల్లలకు చూపిస్తున్నారు. కేవలం సాధారణ అక్షరాలే కాకుండా, కర్సివ్ అక్షరాలను కూడా ఎలా రాయాలో ఆమె నేర్పడం విశేషం.

పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా ఆమె రాసిన అక్షరాలను తమ వేళ్లతో దిద్దుతూ నేర్చుకుంటున్నారు. ఖరీదైన కాగితాలు, డిజిటల్ పరికరాలు లేకపోయినా, అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఎంత చక్కగా విద్యను బోధించవచ్చో ఈ బామ్మ నిరూపించారు. ఆమె సృజనాత్మకతకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆశాట్టి అమ్ముమ్మ ఆలోచన అద్భుతమని, ఇలాంటి ఉపాధ్యాయులు ఎందరికో ఆదర్శమని కామెంట్లు పెడుతున్నారు.