బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తీవ్ర తుపాను మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది వేగంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుండటంతో, ఈరోజు నుంచే రాష్ట్రంపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు మొదలయ్యాయి.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈరోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ‘అర్నబ్’ అతి తీవ్ర తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గత ఆరు గంటల్లో గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదిలింది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 260 కి.మీ., కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 300 కి.మీ. దూరంలో ఉంది. విశాఖపట్నంలోని డాప్లర్ రాడార్ ద్వారా దీని కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ తుపాను రేపు మధ్యాహ్నానికి బాపట్ల, విశాఖపట్నం మధ్య, యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కొన్నిసార్లు గాలి వేగం 140 కిలోమీటర్లకు చేరవచ్చని హెచ్చరించింది.

మరోవైపు, రాష్ట్రంలో తుపాను ప్రభావం ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేప‌టి వరకు తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, బలమైన గాలులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 

"తీరానికి దగ్గరయ్యే కొద్దీ తుపాను తీవ్రత పెరుగుతుంది. ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి" అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. తుపాను సంబంధిత సమస్యలపై తక్షణ స్పందన కోసం మానమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు సంప్రదించాలని కోరారు.

తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పలుచోట్ల అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ బీచ్‌లో సముద్రపు కోత తీవ్రరూపం దాల్చింది. ఇటీవల ఏర్పాటు చేసిన బండరాళ్లు సైతం అలల ధాటికి రోడ్డుపైకి కొట్టుకువచ్చి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ఇప్పటికే అన్ని బీచ్‌లను మూసివేశారు.